హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ మకుటంగా నిలిచింది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ యవనికపై అగ్రభాగాన నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అసాధారణ ప్రయత్నానికి నేడు కొంగరకలాన్ గడ్డపై ఫాక్స్‌కాన్ ప్లాంట్ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నది. మూడేండ్ల క్రితం కేసీఆర్, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లీయూ సమక్షంలో కుదిరిన ఒప్పందం.. నేడు వేలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనతో, ఉత్పాదకతతో కళకళలాడుతున్నది. చైనా వంటి అగ్రదేశాల వైపు చూసే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని తెలంగాణ వైపు తిప్పడం వెనుక కేటీఆర్ అకుంఠిత దీక్ష, బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్ల సుదీర్ఘ ప్రయత్నాలు ఉన్నాయి. ఎందరో యువతీ యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్‌లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిన ఈ ప్లాంట్ ఏర్పడి మే 15వ తేదీతో మూడేండ్లు పూర్తిచేసుకున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటైన ఫాక్స్‌కాన్ ప్లాంటు కేవలం ఒక రాత్రిలోనో, ఒక ఒప్పందంతోనో సాకారం కాలేదు. దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల సుదీర్ఘ నిరంతర శ్రమ దాగి ఉన్నది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే, రాష్ట్ర యువతకు భారీగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని నాటి సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సంకల్పించారు. 2015 జనవరి 11న తొలిసారిగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. వాస్తవానికి ఈ భారీ కంపెనీని మహారాష్ట్రకు తరలించాలని కేంద్రంలోని కొందరు పెద్దలు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన కేటీఆర్.. తైవాన్‌లోని ఫాక్స్‌కాన్ ప్రధాన కార్యాలయంతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, తెలంగాణకున్న పారిశ్రామిక అనుకూలతలను వివరించారు. అంతటితో ఆగకుండా తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏకంగా మూడుసార్లు తైవాన్ వెళ్లి సంస్థ చైర్మన్ యాంగ్ లీయూతో చర్చలు జరిపారు. సత్వర అనుమతులు ఇచ్చే టీఎస్ ఐపాస్ విధానం, శాంతిభద్రతలు, మానవ వనరుల లభ్యతను వివరించి సంస్థను ఒప్పించారు.
పాంట్లు ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ చైర్మన్ అంగీకరించడంతో రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో 186 ఎకరాల భూమి కేటాయించారు. 2023 మే 15న కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్లాంట్, అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధమైంది. రూ.4,595 కోట్లతో ప్రారంభమైన ఈ ప్లాంట్ దేశ ఎలక్ట్రానిక్స్ రంగంలోనే అతిపెద్ద హబ్‌గా అవతరించింది. ప్లాంట్ ప్రారంభంతోనే 25,000 మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్లాంట్ సక్సెస్ కావడంతో, ఫాక్స్‌కాన్ సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించింది. మరో రూ.4,800 కోట్ల అదనపు పెట్టుబడితో కొంగరకలాన్ ప్లాంట్‌లో ఎయిర్‌పాడ్స్ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ప్రస్తుతం నెలకు లక్ష ఎయిర్పాడ్లు ఉత్పత్తి అవుతుండగా, విస్తరణ పూర్తయితే ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుంది. ఇకడ తయారయ్యే ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్ పాడ్స్ ప్రో 3 మాడల్స్, ఫిట్నెస్ ప్రొడక్ట్స్ అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ల సరఫరాలో దాదాపు 70% వాటా కలిగిన ఫాక్స్‌కాన్, గూగుల్, అమెజాన్, షియోమి, హెచ్‌పీ, హువావే, సిసో, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు ఉత్పత్తులను అందిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు, యువతకు ఇదొక పెద్ద వరంగా మారింది.