హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరయుద్ధం సాగించిన వైతాళికుడు దాశరథి అని కొనియాడారు.
అగ్నిధార, రుద్రవీణ వంటి అద్భుతమైన కావ్యాలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తికి ఎప్పటికీ ప్రతిరూపమని కేటీఆర్ పేర్కొన్నారు. మహాకవి దాశరథిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గౌరవించిందని గుర్తుచేశారు. ఆయన పేరిట ప్రత్యేకంగా సాహితీ పురసారంతో పాటు ఏటా జూలై 22న ఆయన జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించినట్టు చెప్పారు. ఆ మహనీయుని రచనలు, ప్రదర్శించిన పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు.