KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ప్రపంచమే కుగ్రామం’ అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఆ మహనీయుడు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించామన్నారు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనని పేర్కొన్నారు. ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. పేదవారి సంక్షేమాన్ని కేసీఆర్ ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారని తెలిపారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో రూ. 3500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారని గుర్తుచేశారు. కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారని తెలిపారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయ్యిందని తెలిపారు. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకు రాబట్టే ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదని అన్నారు. అన్నింటికీ మందు పోరాడే పార్టీకి పార్లమెంట్లో తగిన సీట్లు ఇవ్వకపోవడమే అని తెలిపారు. లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయని అన్నారు.
మోనోపలీ (ఏకాఛత్రాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని కేటీఆర్ తెలిపారు. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలను కేంద్ర ప్రభుత్వం కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదని తెలిపారు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయని అన్నారు. కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుందని అన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్టీయూ (BRTU) పనిచేసినా అభ్యంతరం లేదని తెలిపారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, బీఆర్టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చని పేర్కొన్నారు.లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుందని చెప్పారు.
సోనియా గాంధీ ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదామని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దామని.. లేబర్ కోడ్ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తామని అన్నారు. దీనిపై వరంగల్లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.