IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతున్నది. శనవారం సైతం పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల్లోనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఇండిగో సంక్షోభంపై క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేశారు. సీఈవో వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయగా.. ఆయన క్షమాపణలపై సైతం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ సీఈవో వీడియోపై కమ్యూనిటీ నోట్ ఉంచగా.. యూజర్లు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
ఇండిగో, ఇతర విమానయాన సంస్థలకు డీజీసీఏ కొత్త రూల్స్ గురించి ఏడాది కిందటే చెప్పిందని.. కానీ, ఆ రూల్స్‌ను ఇండిగో పాటించలేదని.. అందుకే ఈ సమస్య తలెత్తిందని యూజర్లు మండిపడ్డారు. డీజీసీఏ నియమాలను పాటించలేదని ఇండిగో తన ప్రకటనలో అంగీకరించలేదని, అయితే ఇదే అన్ని సమస్యలకు కారణమంటూ పలువురు ఎయిర్‌లైన్ సంస్థపై ఆగ్రహం వెలిబుచ్చారు. కమ్యూనిటీ నోట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇండిగో టిక్కెట్లు ఎందుకు అమ్ముతోంది?’. అసౌకర్యానికి ఇండిగో పరిహారం ఇస్తుందా?’ అని నిలదీశారు. ‘ఇది ఇండిగోకు చాలా అవమానకరమైన విషయం. విమానయాన సంస్థ ప్రణాళిక స్థాయిలో ఘోరంగా విఫలమైందా? డీజీసీఏని బ్లాక్ మెయిల్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా?’ అంటూ మరో యూజర్ ప్రశ్నించారు.
ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. విమానాలు రద్దు చేసినప్పటికీ రీఫండ్ చేయలేదని.. అసౌకర్యానికి పరిహారం చెల్లించాల్సిందే’ అంటూ మరో యూజర్ డిమాండ్ చేశారు. నిబంధనలు సడలించాలని డీజీసీఏని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ పరిస్థితిని సృష్టించారంటూ మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. కొత్త నియమాల గురించి గతేడాది జనవరిలో తెలియజెప్పారని.. లోపాలను సవరించేందుకు తగినంత సమయం ఉన్నా ఆ పని చేయలేదని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. కేవలం రీఫండ్ చేయడం వల్ల కలిగే అసౌకర్యాన్ని భర్తీ చేయడానికి పలువురు యూజర్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు యూజర్లు ఇండిగో నాయకత్వంతో మార్పులు చేయడంతో పాటు ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.