నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్31(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు శుక్రవారం నల్లగొండ పట్టణంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పట్టణంలో పాదయాత్ర చేస్తూ సమస్యలను గుర్తిస్తూ, అధికారులతో చర్చిస్తూ ముందుకు సాగారు. ఎంజీ యూనివర్సిటీ వద్ద కేటీఆర్ బృందానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో వేలాది బైకులతో ఘనస్వాగతం పలికి పాలిటెక్నిక్ కాలేజీ వరకు తోడ్కొని వచ్చారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 50కోట్లతో మొదటి దశలో నిర్మించనున్న ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు ప్రసంగించారు. ముందుగా టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సమన్వయంతో నల్లగొండకు చెందిన ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్తలు అమెరికా నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. తామంతా కూడా తమ మాతృభూమి నల్లగొండలో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌లో కంపెనీలను పెట్టడానికి సిద్ధమని ప్రకటించారు.
యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. వీరంతా కలిపి 1,600 మందికి ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ఎంఓయూలు కూడా సిద్ధం చేసినట్లు ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు. ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్ తీసుకుంటున్న చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడాదిన్నరలో నల్లగొండ ముఖచిత్రాన్ని మారుస్తామని ప్రకటించారు. త్వరలో రూ.70కోట్లను విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే రూ.30 కోట్లు కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. నల్లగొండలో ఐదు బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలకు రూ.4.50 కోట్లు, రెండు వైకుంఠ ధామాలకు రూ.3కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఐటీ హబ్‌ను కూడా 18నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌తోనే ఏదైనా సాధ్యమన్నారు. ఫ్లోరైడ్ నుంచి విముక్తి చెంది నేడు నల్లగొండ జిల్లా వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. తర్వాత బీట్ మార్కెట్ ఆవరణలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం, ఎన్జీ కాలేజీ, ఎస్పీ కార్యాలయం మీదుగా క్లాక్ టవర్ వరకు సుమారు గంటర్నర పాటు కాలినడకన రోడ్లు, డ్రైనేజీ, జంక్షన్లు పరిశీలిస్తూ మధ్యమధ్యలో పట్టణ ప్రజలు, దుకాణాదారులతో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ఎంతో ఓపికగా, సామాన్యుడిలా అందర్నీ పలకరిస్తూ పట్టణంలోని సౌకర్యాలపై ఆరా తీస్తూ ఏమీ చేస్తే నల్లగొండ బాగుంటుందని అడిగారు. క్లాక్‌టవర్ సెంటర్లో అభివృద్ధి పనులపై చర్చించారు. జంక్షన్ విస్తరణతో పాటు టౌన్‌హాల్ నిర్మాణం, ఇతర కట్టడాలపైనా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత వాహనంలో బయల్దేరి బయలుదేరి డీఈఓ కార్యాలయం ఎదుట ఉన్న జంక్షన్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి జైలుఖానా వద్ద జంక్షన్‌ను పరిశీలిస్తూ అటుగా వస్తున్న వాహనదారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బాగానే పనిచేస్తున్నారా అని జానకిరాములు అనే వ్యక్తిని సరదాగా ప్రశ్నించగా బాగానే పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. రోడ్లు విస్తరించాలని, తాను చదువుకున్న ఎన్జీ కాలేజీని మళ్లీ కట్టాలని, ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తేనే బాగుంటుందని జానకిరాములు చెప్పగా… ఏడాదిన్నరలో అన్నీ చేద్దామంటూ ముందుకు సాగారు.
7గంటల పర్యటన…
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవల మృతి చెందడంతో కనకదుర్గ కాలనీ వెనకభాగంలోని ఆయన ఇంటికి కేటీఆర్ వెళ్లారు. మారయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం జీఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మున్సిపాలిటీ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అందులో నల్లగొండతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పథకాలపై చర్చించారు. మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, పాలకవర్గాలు, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సుమారు ఏడు గంటల పాటు నల్లగొండలో మంత్రుల పర్యటన కొనసాగింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నల్లగొండ రూపురేఖలు మార్చేందుకు సమగ్ర నివేదికలు సిద్ధం కానున్నాయి. సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మార్పు చూపించాలన్న పట్టుదలతో ముందుకు సాగనున్నారు. ్ర
పముఖులు హాజరు..
కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, ఐటీ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సత్యనారాయణ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండకూ ఐటీ హంగులు
మంత్రి కేటీఆర్ ట్వీట్
నల్లగొండ, డిసెంబర్ 31 : నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్లో ప్రకటించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల తర్వాత నల్లగొండలోనూ ఐటీ హబ్ ఏర్పాటవుతున్నదని పేర్కొన్నారు. టూ టైర్ సిటీస్ (ద్వితీయ శ్రేణి పట్టణాల్లో)కు ఐటీ హంగులు కల్పించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హబ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి భవనాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
నల్లగొండ ప్రజలం రుణపడి ఉంటాం
ఎమ్మెల్యే కంచర్ల
సీఎం కేసీఆర్‌కు నల్లగొండ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. దత్తత మాట మేరకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామన్నారు. 20 ఏండ్ల నుంచి అభివృద్ధి ఎరుగని నల్లగొండను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో నల్లగొండను అద్భుతంగా సుందరనగరంగా అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రకటించారు.