హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లక్ష మందికి సరిపడా అత్యధిక సంఖ్యలో వైద్యులు, పడకలు ఉన్న రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఒకో మెడికల్ కాలేజీ, వైద్యశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింతగా పెంచుతున్నదని వివరించారు. అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వపరంగానే కాకుండా చాలా ఎన్జీవోలతో కూడా కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.
విద్యా, ప్రజారోగ్యం, జీవనోపాధి అనే మూడు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఫౌండేషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రజలు, సంసృతి, వ్యవస్థాపక, దాతృత్వ కార్యకలాపాలపరంగా యూఎస్, భారతదేశం మధ్య లోతైన సంబంధాలను గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ప్రపంచంలో ఎకడా లేనివిధంగా అత్యధిక స్టూడెంట్ వీసాలు జారీ చేస్తున్నదని, తెలంగాణ, ఏపీల నుంచి తెలుగువారు యూఎస్‌లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు, ఏఐఎఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.