మహబూబాబాద్ : రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ మాత్రమేనని, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు ముందుముందు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సెమీ ఫైనల్, ఫైనల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించాలని సూచించారు. మహబూబాబాద్‌లో సర్పంచ్‌లో సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలె, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలె’ అన్నది మనందరి కోరిక, ఈ రాష్ట్ర ప్రజల అందరి కోరిక అని చెప్పారు.
కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లో.. ‘పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ మాత్రమే. ఆ తర్వాత సెమీ ఫైనల్ ఉన్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలే సెమీఫైనల్. ఆ తర్వాత 2028 అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్. ఈ అన్ని దశల్లో అద్భుత ఫలితాలు సాధిస్తూ ఫైనల్లో విజయం సాధించాలె. మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నదే మనందరి కోరిక. ఈ రాష్ట్ర ప్రజల అందరి కోరిక. ఎందుకంటే పాడై పోయిన వ్యవసాయాన్ని బాగుచేసింది కేసీఆర్. రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్’ అని గుర్తుచేశారు.
‘ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది కేసీఆర్. వ్యవసాయం కోసం 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్. వెనుకబడ్డ మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. మహబూబాబాద్‌లో ఒక మెడికల్ కాలేజీని, ఒక నర్సింగ్ కాలేజీని, ఒక సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను పెట్టింది కేసీఆర్. అందుకే మల్లొక్కసారి కేసీఆర్ అధికారంలోకి రావాలె అంటున్న’ అని కేటీఆర్ చెప్పారు.