మహబూబాబాద్ : గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు ఎవని అత్త సొమ్ము కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్‌లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తారని చెప్పారు. మీ పంచాయతీకి నిధులు ఇవ్వం అని బెదిరిస్తారని, ఆ నిధులు ఎవని అబ్బ సొత్తో, అత్త సొమ్మో కాదని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘మహబూబాబాద్‌లో మనం ఎన్ని పంచాయతీలు గెలిచినం అన్నది లెక్కగాదు. మనం నూట ముప్పయో.. నూటా నలభయో గెలిచినం. వాళ్లు తొండిచేసి మనం గెలిచిన మరో పదో, ఇరవయో పంచాయతీలను లాక్కున్నరు. అయినా మనం బాధపడేది లేదు. భయపడేది లేదు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వచ్చిన సర్పంచ్ సోదరులారా.. ఇప్పుడు మీ మీద ఒత్తిడి ఉంటది. మీ ఎమ్మెల్యే మీకు నిధులు ఇయ్యనంటడు. మీకు ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యనంటడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతడు. కానీ నేను ఒక్కటే చెబుతున్నా.. మీమీ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి అబ్బ సొత్తో, ఎవరి అత్త సొమ్మో కాదు. అది ప్రభుత్వ సొమ్ము’ అని చెప్పారు.
‘బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం.. దేశంలో ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మూడో అంచెలో జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్‌ల రూపంలో ప్రభుత్వాలు ఉంటయి. ఆ తర్వాత నాలుగో అంచెలో పల్లెల్లో మండల పరిషత్‌లు, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉంటయ్. ఐదో అంచెలో గ్రామస్థాయిలో పంచాయతీలు ఉంటయ్. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గూడా గట్లనే. గ్రామంలో మీదే పవర్. పంచాయతీకి వచ్చే నిధులను ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ అడ్డుకోలేడు. అడ్డుకునే ప్రయత్నం చేసినా అది చెల్లదు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీకు అండగా ఉంటది. అందులో నిధులు, విధుల గురించి స్పష్టంగా రాసి ఉన్నది’ అని తెలిపారు.
‘ఫైనాన్స్ కమిషన్ నుంచి మీ గ్రామానికి ఒక్క రూపాయి నిధులు విడుదలైతే అందులో 85 పైసలు నేరుగా మీ గ్రామానికి వస్తయ్. వాటిని ముఖ్యమంత్రిని, మంత్రిని, ఎమ్మెల్యేని అని ఏ గొట్టంగాడు కూడా అడ్డుకోలేడు. ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలయ్యే నిధుల్లో 85 పైసలు గ్రామ పంచాయతీ ఖాతాకు, మరో 10 పైసలు మండల పరిషత్ ఖాతాకు, మిగతా 5 పైసలు జిల్లా పరిషత్ ఖాతా వస్తయ్. ఇవి ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకిచ్చే పైసలు. బీఆర్ఎస్ హయాంలో ఫైనాన్స్ కమిషన్ నుంచి రూపాయి నిధులు వస్తే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం కోసం మరో రూపాయి కలిపి ఇచ్చేది. ఆ నిధులతోనే పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నం’ అని కేటీఆర్ వెల్లడించారు.
‘ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక రెండేళ్లలో పల్లెలు మాసిపోయినయ్. ట్యాంకర్లల్ల నీళ్లు పోసేటోడు లేడు. ట్రాక్టర్లలో డీజిల్ పోసెటోడు లేడు. కరెంటు బుగ్గపోతే పెట్టించేటోడు లేడు. పారిశుద్ధ్యం కూడా సక్కగ లేదు. అందుకే నేను బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్‌లను కోరుతున్నా. మీ పని తీరు ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు సిగ్గొచ్చే విధంగా ఉండాలె. ‘బీఆర్ఎస్ నేతలు గెలిచిన 4 వేల ఊళ్లు కళకళలాడుతున్నయ్.. మిగతా ఊళ్లు వెలవెలబోతున్నయ్’ అనే చెప్పుకునే విధంగా మీరు పనులు చేయాలె. మిమ్మల్ని చూసి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు రావాలె’ అని చెప్పారు.