హైదరాబాద్ : మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌పై జూపల్లి పొగడ్తల వర్షం కురిపించేవాడని, పాలమూరుకు దేవుడు కేసీఆర్ అని చెప్పేవాడని కేటీఆర్ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మనం టికెట్ ఇవ్వకపోతే జూపల్లి పొయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిండని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు అక్కడ తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్‌పై నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నడని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్నడని చెప్పారు. రేవంత్‌రెడ్డి దేవుడు అంటున్నడని, ఆయన ఎవరికి దేవుడు..? అని ప్రశ్నించారు.
మంత్రి జూపల్లి అవకాశవాదంతో తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయి, తనను నమ్ముకున్న ప్రజలను, రైతులను మోసం చేసిండని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయితుంటే రైతులకు ఒకే ఒక్కసారి రైతు భరోసా డబ్బులు వేసిండ్రని చెప్పారు. యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని అన్నారు.