హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): మక్క కొనే దిక్కులేక జోగుళాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల కొనుగోలు కేంద్రం వద్ద మక్క రైతు జమ్మన్న హఠాన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చేతగానితనంతో సాగు సంక్షోభాన్ని సృష్టించిన కాంగ్రెస్ స ర్కారు చేసిన హత్యేనని బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో రైతాం గం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనేందుకు మక్క రైతు మరణమే నిదర్శమని ధ్వజమెత్తారు.
పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రా ల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు కో ల్పోయే దుస్థితి రావడం అత్యంత బాధాకరమని ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మన్న మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం మక్క పంటను కొనకపోవడంతోనే జమ్మన్న ప్రా ణాలు కోల్పోయాడని ఆరోపించారు. బక్కరైతు నిండు ప్రాణం బలికావడానికి సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పదేండ్లపాటు సంతోషం గా సాగిన వ్యవసాయాన్ని రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీటి సేద్యంగా మా ర్చిందని విరుచుకుపడ్డారు.
రేవంత్ పాలన లో 750మందికిపైగా రైతులు ప్రాణాలు విడిచినా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఓ వైపు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందక రైతాంగం అప్పుల పాలవుతుంటే, మరోవైపు భారీ వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులకు కనీస పరిహా రం ఇవ్వకుండా వారిని బలవన్మరణాల వైపు నెట్టేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పనికిరాని యాప్ల పేరిట యూరియా అం దకుండా చేసి అన్నదాతలను అష్టకష్టాలు పాలుచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాగును సంక్షోభంలోకి నెట్టిన ఈ పాపం ఊరికే పోదని హెచ్చరించారు.
రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్న రైతుల వెతలు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో మరణించిన రైతు జమ్మన్న కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ రైతాంగానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి తరఫున అసెంబ్లీలో, క్షేత్రస్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం రైతులపై తన విధానాన్ని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.