నిజామాబాద్, డిసెంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అక్రమాస్తుల వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా హాట్ టాపిక్‌గా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అవినీతి అనకొండలు ఇంకెంత మంది ఉన్నారో? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. దొరికితే దొంగ… అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ప్రజలను ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తూ పీల్చి పిప్పి చేస్తోన్న అక్రమార్కులంతా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతూ రాజ్యమేలుతున్నారు. నీతులు వల్లిస్తూనే ప్రజలను సతాయిస్తున్నారు. 2024, 2025లో వెలుగు చూసిన అనేక అవినీతి కేసుల్లో రూ.కోట్లలో ఆస్తులు కూడబెట్టిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. లంచం పుచ్చుకుంటూ దొరికిన కేసుల్లోనూ కట్టల కొద్దీ డబ్బులు బయట పడడం అవినీతికి పరాకాష్టకు చేరుకుంటోంది.
రెవెన్యూ, పోలీస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్, రవాణా, విద్యా, పురపాలక, భూగర్భ గనులు, వైద్యారోగ్య శాఖల్లో చెప్పలేని విధంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవడో ఒకడు పూటకోసారి డబ్బులతో పట్టుబడుతున్నప్పటికీ అవినీతి ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. ఏసీబీ వరుస దాడులకు పాల్పడుతున్నప్పటికీ అవినీతి అధికారుల్లో చలనం తీసుకు రావడంలేదు. బలంగా శిక్షలు లేకపోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. తాత్కాలికంగా రిమాండ్ పంపి వదిలేస్తుండగా కేసులో శిక్షలు పడకపోవడంతో భయమనేది అక్రమార్కుల్లో ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. లంచంతో అడ్డంగా దొరికిన ఉద్యోగులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలన్న వాదన ప్రస్తుతం ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది.
అక్రమ సంపాదన దారి మళ్లింపు
అక్రమ సంపాదనను గుట్టలుగా పోగు చేసి వాటిని పెట్టుబడులుగా మారుస్తున్నారు. తెలివిగా తమ పేరుపై కొన్ని చోట్ల భూములు, ఇతరత్రా ఆస్తులు కూడబెడుతున్నారు. కుటుంబీకులు, దగ్గరి బంధువుల పేర్లపై భారీ ఎత్తున ఆస్తులు కొంటున్నారు. చట్టం ముందు చిక్కకుండా తప్పించుకుని తిరిగేందుకు అవినీతి పరులు కొత్త ఎత్తుగడలతో పావులు కదుపుతున్నప్పటికీ ఏసీబీ ఆట కట్టిస్తోంది. వారికి నెలవారీగా జీతం రూపంలో వచ్చే ఆదాయాన్ని లెక్కించి ఆస్తులను తేలుస్తున్నారు. ఇతరత్రా మార్గాల ద్వారా డబ్బులు రాబడితే దానికి పత్రాలను, ఆధారాలను అడుగుతున్నారు.
అక్రమార్కులు సరైన ఆధారాలు, లెక్కలు చూపించకపోవడంతో వాటిని అక్రమాస్తులుగా తేలుస్తున్నారు. లంచం, అవినీతి, అక్రమాలతో వచ్చిన డబ్బును భూములు, హోట ళ్లు, ఫ్లాట్లు, బంగారం, విలువైన వాహనాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇందుకు డీటీసీ కిషన్ కేసు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్తులు ప్రధానంగా నిజామాబాద్‌లోనే ఉండగా అవన్నీ విలువైన వ్యాపారాల్లోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు అదనపు కలెక్టర్‌గా పని చేసి రిటైర్ అయిన వ్యక్తి సైతం బైపాస్ రోడ్డులో అధికారాన్ని అడ్డం పెట్టి ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పెట్టుబడులు పెట్టాడు.
తన మాతృ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలను తనవైపునకు తిప్పుకుని తెర వెనుక వ్యాపారాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. చట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకుని కుమారులు, కుమార్తెలు, అన్న కూతుర్లు, వదిన పేరిట వ్యాపారాలు నడిపిస్తూ అధికార పార్టీ నేతల అండగా చేతిలో మామూళ్లు ముట్టజెప్పి చక్రం తిప్పుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా ఎదిగి ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఫక్తూ సొంత ప్రయోజనానికి ప్రాధాన్యం ఇస్తోన్న నేతల తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. వీరి స్వలాభం వల్ల ఉద్యోగ సంఘాలకు అపకీర్తి వస్తోందంటూ సామాన్య ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రజాపాలనలో ఉద్యోగులకు తీవ్ర నష్టం సంభవిస్తుంటే నోరు మెదపకుండా వ్యాపారాల్లో మునిగి తేలుతూ సొంత లాభం కోసం పాకులాడుతున్న తీరును ఉద్యోగ సంఘాల్లోని సభ్యులంతా తప్పుబడుతున్నారు.
ప్రధాన ఘటనలు..