Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం.. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కేటీఆర్ అన్నారు. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కేటీఆర్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు.