హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ సగం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తన నాయకత్వం, పరిపాలనపై ఒక విస్తృత సర్వే చేయించుకున్నా రని, అందులో ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సుమారు 78 సీట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ సర్వే తేల్చిందని వెల్లడించారు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వెల్లడైందని, ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలను కుంటున్నారని చెప్పారు.
తన సొంత సర్వేతోపాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజావ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం మొదలు రైతుబంధు దాకా అన్నింటిపైనా అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, బీజేపీకి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పతనం దాదాపు ఖా యమైపోయిందని, జారుడుబండపైన ఉన్న ఆ పార్టీ ఇక పుంజుకొనే అవకాశమే లేదని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది. అబద్ధాలు, మోసపూరిత మాటలతో రేవంత్ సర్కార్, నాయకత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రమైంది. 420 హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్ల అమల్లో ఘోరంగా విఫలమైనందు వల్లే ఆ పార్టీ సబ్బండ వర్గాల నమ్మకం కోల్పోయింది. సగం పరిపాలనపై సీఎం రేవంత్ చేయించిన సొంత సర్వేలోనే ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చూడాలనుకొంటున్నట్టు చెప్పాయి.
– కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) కార్యక్రమంపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం నియమించిన బీఎల్వోలకు సరైన శిక్షణ, వసతులు లేక ఈ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతున్నదని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, వాటిలో ఓటర్ల నమోదు అంశాలపై సరైన అవగాహన లేకుండానే కేటాయించారని కిందిస్థాయి నుంచి పార్టీ వర్గాలు చెప్తున్నారని పేర్కొన్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో భారీగా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు బయటపడిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు దొంగ ఓట్లను చేర్చేందుకు, బీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉన్నని హెచ్చరించారు. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ అనే రాజ్యాంగ స్ఫూర్తితో దొంగ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని సూచించారు.
హైదరాబాద్ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పార్టీ తరఫున ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.