న్యూఢిల్లీ, జూలై 9 : భారత్లో 2025-26 సంవత్సరంలో ప్రతిరోజు 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 4,791 పాఠశాలలు ఏడాది కాలంలో మూతపడినట్లు యూడీఐఎస్ఈ తాజా నివేదిక పేర్కొంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధికంగా 2,426 పాఠశాలలు మూతపడ్డాయి. ఆ రాష్ట్రంలోని ఉన్న మొత్తం పాఠశాలల్లో ఇది సగం కన్నా ఎక్కువ. 2024-25లో దేశంలో మొత్తం 14,71,473 పాఠశాలలు ఉండగా 2025-25లో ఆ సంఖ్య 14,66,682కి పడిపోయింది.
అనేక రాష్ర్టాలలో పాఠశాలల విలీనం కారణంగానే ప్రధానంగా ఈ తగ్గుదల ఉందని విద్యా మంత్రిత్వశాఖలోని పాఠశాల విద్యకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కొన్ని రాష్ర్టాల్లో పాఠశాలల సంఖ్య పెరగడం గమనార్హం. బీహార్లో 946, ఛత్తీస్గఢ్లో 234, ఢిల్లీలో 87 పాఠశాలలు కొత్తగా ఏర్పడ్డాయి. కొత్త స్కూళ్లు వచ్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం విశేషం. బీహార్లో 4,37,037, ఛత్తీస్గఢ్లో 79,459, ఢిల్లీలో 45,250 మందికి పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య చేరింది.
5,663 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు, కానీ 20,000 మంది టీచర్లున్నారు. విద్యార్థులు ఎవరూ లేని స్కూల్స్ సంఖ్య 7,993 నుండి 5,663కి పడిపోయింది.
మొదటిసారిగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గింది. 24-25లో 1,04,125 ఉండగా 2025-26లో సంఖ్య 1,00,843కి తగ్గింది. అయితే అనేక రాష్ర్టాలలో అటువంటి పాఠశాలల సంఖ్య మాత్రం పెరిగింది.
