నమో అంటే నమ్మించి మోసం చేయడం: మంత్రి కేటీఆర్
నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.. ‘రోజ్‌గార్ మేళా’ పేరుతో 10 లక్షల ఉద్యోగాల నియామకమంటూ ప్రధాని మోదీ నిరుద్యోగ యువతను మభ్యపెట్టే కొత్త వంచనకు తెరతీశారని చెప్పారు.
- నిరుద్యోగులకు ప్రధాని మోదీ నయా వంచన
- రోజ్‌గార్ మేళాతో మరో కొత్త ఎన్నికల ఎత్తుగడ
- ఏటా 2 కోట్లిస్తామని..10 లక్షల ఉద్యోగాలా !
- 8 ఏండ్లలో 16 కోట్లు ఎందుకు భర్తీ చేయలేదు?
- మీరెన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం ఇవ్వగలరా?
- ప్రతి ఎన్నికలకు ముందు ప్రధాని కొత్త డ్రామా
- ప్రధానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.. ‘రోజ్‌గార్ మేళా’ పేరుతో 10 లక్షల ఉద్యోగాల నియామకమంటూ ప్రధాని మోదీ నిరుద్యోగ యువతను మభ్యపెట్టే కొత్త వంచనకు తెరతీశారని చెప్పారు. నిరుద్యోగులతో పరిహాసమాడటం మాని ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముందు రోజ్‌గార్ మేళాతో మోదీ కొత్త డ్రామా ప్రారంభించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పి, 10 లక్షలకు కుదించారన్నారు. తెలంగాణలో 2.24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, సుమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.
మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ సారాంశం.. మీరు చేపట్టిన ‘రోజ్‌గార్’ మేళాతో దేశ యువత సంతోషం ఎకువ రోజులు ఉండేది కాదని అర్థమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు నింపుతామని ప్రకటించి 8 ఏండ్లలో 16 కోట్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నది. నిరుద్యోగుల ఆశలపై రోజ్‌గార్ మేళా పేరుతో ఆటలాడటం సరైన చర్య కాదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన మీరు, ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారు. కేవలం 75 వేలమందికి నియామకపత్రాలు అందజేసి, ఆర్థిక వ్యవస్థ అనేక కష్టాల్లో ఉన్నదంటూ మీరు చేసిన వ్యాఖ్యలు, ఈ రోజ్‌గార్ హామీ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీ పరిపాలనావైఫల్యం, అడ్డగోలు ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తున్నదనే విషయం మీకు గుర్తు చేస్తున్నా. కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచారం, పదేపదే నిరుద్యోగ యువతతో పరిహాసం ఆడుతున్నట్టున్నది. ఉద్యోగాల భర్తీపై, దేశవ్యాప్తంగా ఖాళీలు నింపాలని, యువతకు ఉపాధి కల్పించాలని 9 జూన్ 2022న మీకో బహిరంగ లేఖ రాశా. దానికి మీ నుంచి సమాధానం లేదు. మీరు చేస్తున్న ఈ రోజ్‌గార్ మోసం ‘బాత్ కరోడోమే.. కామ్ పకోడోమే’ అన్న తీరుగా ఉన్నది. ఇలా చేయడం వల్ల.. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని రుజువు అయ్యింది. ఇంకా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలిచాను.
- బీజేపీ 8 ఏండ్ల కాలంలో మీరు ఇచ్చిన హామీ మేరకు 16 కోట్ల ఉద్యోగాలు నింపాలి. నేటివరకు భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?
- 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 8 ఏండ్లలో సుమారు 1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినం. 91 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించినం. 130 కోట్ల దేశ జనాభాలో మీరు నింపిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత?
- దేశంలో ఏటా 2 లక్షలకుపైగా కేంద్ర ఉద్యోగులు రిటైరవుతున్నారు. కనీసం ఏటా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయని మీరు, రోజ్‌గార్ మేళా పేరుతో 75 వేల మందికే నియామకపత్రాలు అందజేయడాన్ని నిరుద్యోగులు గమనిస్తున్నారు.
- 2014 నుంచి 2022 జూన్ నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 7 లక్షలు. ఇంకా భర్తీ చేయాల్సినవి దాదాపు 16 లక్షలున్నట్టు మీ ప్రభుత్వమే చెప్పింది. ఈ నేపథ్యంలో రోజ్‌గార్ మేళా ద్వారా కేవలం 75 వేల మందికి నియామకపత్రాలు అందించి, నిరుద్యోగులను మీరేం చేయదలుచుకున్నారు?
- రోజ్‌గార్ మేళా ప్రకటన సందర్భంగా 38 శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. 38 శాఖల్లో మొత్తం ఖాళీలు ఎన్ని? వాటిని ఎప్పటివరకు భర్తీ చేస్తారో స్పష్టం చేయగలరా? జాతీయ జాబ్ క్యాలండర్‌ను విడుదల చేయగలరా?
- 8 ఏండ్లలో ఉద్యోగాలను భర్తీ చేయని మీరు.. మీ పదవీకాలం ముగుస్తున్న ఏడాదిన్నర ముందు తీరికగా ఎన్నికల రోజ్‌గార్ మేళా ప్రకటించడాన్ని దేశ ప్రజలు గమనించడం లేదనుకొంటున్నారా?
- దేశవ్యాప్తంగా నిరుద్యోగం గతంలో ఎప్పుడు లేనంతగా పెరిగి రికార్డులు నమోదు చేస్తున్న తరుణంలో 75 వేల ఉద్యోగాలతో రోజ్‌గార్ ప్రచారం దేశ నిరుద్యోగ యువతతో మీరు చేస్తున్న క్రూర పరిహాసం. ఈ కంటితుడుపు చర్యను నిరుద్యోగ యువత గమనిస్తున్నది.
- ప్రతి ఎన్నికల ముందు ప్రజలను మోసగించే ప్రచార కార్యక్రమాలను పకనపెట్టి నిబద్ధతతో నిరుద్యోగ సమస్యపై దృష్టిపెట్టాలి. హామీ మేరకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలి. మీడియాలో ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేలా అన్ని కేంద్రశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రతిసారి మాదిరి ఈ సారి కూడా యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేస్తే మీ ప్రభుత్వంపై తిరగబడే రోజు త్వరలో వస్తుందన్న విషయం గుర్తిస్తే మంచిది.
- రాష్ట్ర పరిధిలో 2,24,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినప్పుడు, ప్రైవేట్ రంగంలో దాదాపు 16.5 లక్షల ఉద్యోగావకాశాలు ఇచ్చినప్పుడు, దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలివ్వాల్సి ఉంటుందో మీరే చెప్పాలి.
- నిరుద్యోగ యువత విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బాధ్యతలో కేంద్రం నిర్వహిస్తున్న బాధ్యత చాలా చిన్నదని గణాంకాలే చెప్తున్నాయి. లెకలేస్తే మీ అసలు రంగు బయటపడుతుంది.
మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల పందేరంతో సుమారు 2.5 లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థలో సుమారు 50% ఉన్న రిజర్వుడ్ క్యాటగిరీలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయి.
లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నది మీ ప్రభుత్వం. ఓ వైపు ఉద్యోగాలు తొలగిస్తూ తిరిగి ఉద్యోగ మేళా అంటే నోటితో నవ్వుతూ నోసటితో వెకిరించడం కాదా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

