ఆ ఇల్లు (రేకుల షెడ్డు) నిరుద్యోగ యువతకు కలిసి వచ్చింది. అందులో చదివితే జాబ్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని నిజం చేసింది. 1998 నుంచి 2015 వరకు అక్కడ అనేక మంది పోటీ పరీక్షలకు సిద్ధమవ్వగా, దాదాపు 50 మందికి పైగా కొలువులు సాధించడం ప్రత్యేకతను సంతరించుకున్నది. తాజాగా టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి చెన్నూర్‌లోని సొన్నాయివాడలో గల కృష్ణమూర్తి ఇంటిపై పడింది.
మంచిర్యాల, మార్చి 19, నమస్తే తెలంగాణ :చెన్నూర్ మండల కేంద్రంలోని సొన్నాయిల వాడలో సంకీతపు కృష్ణమూర్తి ఇల్లు ఉంది. ఇందులో చదివితే ఉద్యోగం గ్యారంటీ అన్న నమ్మకముండేది. 1998 నుంచి 2015 వరకు ఇక్కడ చాలా మంది ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు. చెన్నూ ర్ పట్టణం నుంచేగాకుండా చుట్టు పక్క ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడేవారు. ఒక్కో సమయంలో స్థలం సరిపోయేది కాదు. పగలంతా సందడిగా ఉండడంతో వారు ప్రత్యేక ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. నిరుపేద కుటుంబాల వారు ఓ వైపు పగలు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూనే.. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏకధాటిగా ప్రిపేరయ్యేవారు. ఇక్కడ చదివిన వారిలో 50 మందికి పైగా సర్కారు కొలువులు సాధించి స్థిరపడ్డారు. ప్రస్తుతం జావీద్ ఖాన్, నక్క లక్ష్మీనారాయణ, బుద్దారపు శంకర్, సీహెచ్ మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగం చేస్తున్నారు. మహేందర్ సింగ్ ఎస్జీటీగా, టీ.రాజన్న లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొమారి సంతోష్, ఏ.శంకర్, ఎన్.రాజేశ్‌తో పాటు పలువురు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్.రాజేశ్ ఆర్జేడీగా ఉన్నత పదవిలో ఉన్నారు. అకాడమిక్ పుస్తకాలు చదవడంతో పాటు మిత్రులతో గ్రూపు చర్చల్లో పాల్గొనడం వల్ల సక్సెస్ సాధించామని వారు పేర్కొంటున్నారు. ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఉద్యోగాలు సాధించవచ్చని వారు సూచిస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కొలువు కొట్టడం సులువవుతుందని వారు ప్రస్తుత ఉద్యోగార్థులకు సలహా ఇస్తున్నారు. కాగా, తమ ఇంటిలో చదువుకొని అనేక మంది మంచి స్థానాల్లో ఉండడం గర్వంగా ఉందని కృష్ణపూర్తి తెలిపారు.
మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో కోచింగ్ వెళ్లలేదు. మిత్రులతో కలిసి చెన్నూర్‌లోని సొన్నాయివాడలో గల కృష్ణమూర్తి ఇంట్లో చదువుకు న్నాం. ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తు తం మంచిర్యాలలో కానిస్టేబుల్‌గా చేస్తున్నా. మిత్రుల సహకారం మరువలేనిది. కొందరు ఉపాధ్యాయులుగా, మరికొందరు నాతో పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సంపాదించారు. కోచింగ్ వెళ్తేనే ఉద్యోగం వస్తుందన్న ఆలోచనలో ఉండవద్దు. పట్టుదలతో చదివితే ఉద్యోగం గ్యారంటీ..
– కొమారి సంతోష్, పోలీస్ కానిస్టేబుల్, మంచిర్యాల
నాకు కిరాణం ఉంది. మాకు సొన్నాయి వాడలో చిన్న ఇల్లు (రేకుల షెడ్డు) ఉం ది. అది ప్రశాంత వాతావరణంలో ఉం టుంది. చెన్నూర్‌కు చెందిన చాలా మం ది యువకులు ఆ ఇంట్లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. పొద్దటి నుంచి రాత్రి దాకా కొందరు, రాత్రి నుం చి తెల్లవారు దాకా ఇంకొందరు ప్రిపేరయ్యేటో ళ్లు. మొదట్లో అందులో చదివిన కొందరికి ఉద్యోగాలు వచ్చా యి. దీంతో ఏటా చదువుకోవడానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందులో చదువుకున్న వారిలో ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ ఇంట్లో చదువుకొని ఉద్యోగం సంపాదించామని వారు చెబుతుంటే ఆనందంగా ఉంటుంది.
– సంకీతపు కృష్ణమూర్తి, వ్యాపారి, చెన్నూర్
నేను ప్రస్తుతం కోటపల్లి మండలం సిర్సా లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. మా మిత్రులతో కలిసి చెన్నూర్‌లోని కృష్ణమూర్తి ఇంటిలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాను. అకాడమిక్ పుస్తకాలు మాత్రమే చదివాను. ఆర్థిక పరిస్థితుల వల్ల పగలంతా పాఠశాలలో పనిచేసి రాత్రి పూట చదువుకునేవాడిని. స్కూల్ అసిస్టెంట్ సో షల్లో జిల్లాలో రెండో ర్యాంకు సా ధించాను. మాతోటి మిత్రులకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇందుకు చాలా సం తోషంగా ఉంది. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా పట్టుదలతో చదివితే ఫలితముంటుంది.
– జావీద్ ఖాన్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ప్రధానోపాధ్యాయుడు, సిర్సా, కోటపల్లి మండలం
తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. సర్కా రు కొలువుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇది మంచి అవకాశం. కోచింగ్‌ల పేరిట కాలయాపన చేయకుం డా సామూహికంగా పోటీ పరీక్షలకు సం సిద్ధులయితే సులువుగా కొలువు కొట్టవచ్చు. ఆ రోజుల్లో ఇంట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి చదువుకునేటోళ్లం. సబ్జెక్టుల వారీగా చర్చించుకొని అనుమానాలుంటే నివృత్తి చేసుకునేవాళ్లం. ఆ ఇల్లు మాకెంతో కలిసి వచ్చింది. అందులో చదువుకొని ఉద్యోగం సాధించాను.
– నక్క లక్ష్మీనారాయణ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, చెన్నూర్