కుమారి, యువతి, ప్రౌఢ .. మహిళ జీవితంలోని దశలన్నీ కోఠి మహిళా కళాశాలలోనూ కనిపిస్తాయి. సాధారణ జూనియర్ కళాశాలగా ప్రారంభమై.. డిగ్రీ కాలేజీగా ఎదిగి, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా అవతరించి.. తెలంగాణ సర్కారు చొరవతో.. త్వరలోనే మహిళా విశ్వవిద్యాలయ హోదాను అందుకోనున్నది.
సరిగ్గా తొంభై ఎనిమిదేండ్ల క్రితం ఏడుగురు విద్యార్థినులతో ప్రారంభమైన ఇంటర్మీడియట్ కళాశాల.. త్వరలోనే తెలంగాణలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయంగా రూపుదాల్చనుంది. ఆ సువిశాల ఆవరణలో ప్రతి గోడకూ ఓ కథ ఉంది, ప్రతి చెట్టుకూ ఓ నేపథ్యం ఉంది. ఆ చదువులమ్మ సాక్షిగా ఉన్నతవిద్యను అభ్యసించి.. అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారు అనేకమంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోఠి ఉమెన్స్ కాలేజ్ పోరాట స్ఫూర్తి మాటల్లో వర్ణించలేనిది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో గొంతుకలు గర్జించాయి. లాఠీ దెబ్బలను తట్టుకుని, బాష్పవాయు పొగలను ఛేదించుకొని.. ఎదురొడ్డి నిలబడ్డారు కోఠి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు. ఆ పటిమకు గుర్తింపుగానే, స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమెన్స్ కాలేజ్‌ను విశ్వవిద్యాలయంగా మారుస్తామని ప్రకటించారు.
ఖైరున్నీసా కన్నీటి చారిక..
నేటి కోఠి మహిళా కళాశాల భవనం ఒకనాడు బ్రిటిష్ రెసిడెన్సీగా ఓ వెలుగు వెలిగింది. హైదరాబాద్‌కు మొదటి బ్రిటిష్ రెసిడెంట్‌గా వచ్చిన జె.ఏ. కిర్క్‌పాట్రిక్ కోసం 1798లో దీన్ని యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ను కూడా ఇదే నమూనాలో నిర్మించారు. లోపలికి అడుగుపెట్టగానే.. రెండు పెద్ద దిమ్మెలపై సింహాలు ఠీవిగా దర్శనమిస్తాయి. దర్బార్ హాల్ డిజైనింగ్ ఓ అద్భుతం. ఈ భవంతిని బ్రిటిష్‌వారు కట్టించారని చెబుతున్నా, నిర్మాణ వ్యయాన్ని నిజాం భరించాడని అంటారు. హైదరాబాద్ నవాబులతో కిర్క్ పాట్రిక్‌కు పరిచయాలు ఉండేవి. ఈ క్రమంలోనే నాటి ప్రధాని నవాబ్ మహమూద్ అలీఖాన్ మనవరాలు ఖైరున్నీసాను ప్రేమించాడు పాట్రిక్. ఆమెను పెండ్లి చేసుకోవడానికే మతం మార్చుకున్నాడనీ అంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదారేండ్లు రాగానే పాట్రిక్ ఆ పిల్లలను ఇంగ్లండ్‌కు పంపాడు. దీంతో ఖైరున్నీసా మాతృ హృదయం విలవిలలాడింది. అయినా అతను పట్టించుకోలేదు. తన దారినతాను అప్పటి బ్రిటిష్ ఇండియా రాజధాని కోల్‌కతా వెళ్లిపోయాడు. ఖైర్ ఒంటరిదైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి కిర్క్‌పాట్రిక్ మరణించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఖైరున్నీసాను కిర్క్‌పాట్రిక్ జీవిత భాగస్వామిగా గుర్తించలేదు. రావాల్సిన పరిహారమూ ఇవ్వలేదు. ఇటు నిజాం ప్రభుత్వం కూడా ఆమెను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వలేదు. దీంతో, మచిలీపట్నంలో తలదాచుకోవలసిన పరిస్థితి వచ్చింది. తన పిల్లలను వెనక్కి రప్పించేందుకు ఖైరున్నీసా బ్రిటిష్ సర్కారు మీద పోరాటం సాగించింది. ఆ ఒంటరి మహిళకు ఏ వైపునుంచీ మద్దతు లభించలేదు. అంతలోనే తీవ్ర అనారోగ్యం. చిన్న వయసులోనే ఖైరున్నీసా మరణించింది. ఆ బ్రిటిష్ రెసిడెన్సీ దర్పం వెనుక.. కనిపించని కన్నీటి కథ ఇది. ఓ యువతి పోరాట గాథ ఇది. స్వాతంత్య్రానంతరం 1949లో ఈ భవనాన్ని ఉమెన్స్ కాలేజ్ కోసం ఇచ్చారు. నిజానికి, 1924లోనే ఈ విద్యాలయం ప్రారంభమైంది. కోఠి అంటే పర్షియన్ భాషలో మాన్షన్ (పెద్ద భవనం) అని అర్థం. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న కోఠి ఉమెన్స్ డిగ్రీ, పీజీ కాలేజ్.. నలభై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్నది. 1998లో యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. మూడు సార్లు న్యాక్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం 57 అండర్ గ్రాడ్యుయేట్, 20 పీజీ కోర్సులు అందిస్తున్నది. విశ్వవిద్యాలయంగా మారితే.. ఉస్మానియా పరిధిలోని మహిళా కళాశాలలన్నీ అనుబంధంగా మారే అవకాశం ఉంది. ‘మహిళల కోసం ప్రత్యేకించి ఒక విశ్వవిద్యాలయం తప్పక రావాలి. మా కళా శాలకు అందుకు అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయి’ అంటారు రిటైర్డ్ ప్రొఫెసర్ యోగ జ్యోత్స్న.
అపూర్వ విద్యార్థినులు
కోఠి ఉమెన్స్ కాలేజ్‌లో చదివి కీర్తి శిఖరాలు అధిరోహించిన వారు వేలకొద్ది ఉన్నారు. దేశ, విదేశాల్లో కీలక పదవుల్లో, ఉన్నతస్థానాల్లో ఉన్నవారు అనేకం. ఇక్కడే పాఠాలు నేర్చుకుని, ఇక్కడే ప్రొఫెసర్లుగా పాఠాలు బోధిస్తున్నవారూ ఎంతోమంది. బ్యాంకింగ్ దిగ్గజం రంజనా కుమార్ కోఠి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినే. ఆమె సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా, నాబార్డ్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి బి.చంద్రకళ చదువుకున్నది ఇక్కడే. ‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకత్వ కెరీర్‌ను ప్రారంభించి ఎన్నో హిట్ సినిమాలను అందించిన నందిని రెడ్డి ఈ చెట్టు కొమ్మే. కోఠి ఉమెన్స్ కాలేజ్ ప్రస్తుత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత కూడా ఇక్కడే చదువుకొన్నారు. నిజానికి ఈ జాబితా చాలా పెద్దది. చదువులు, మార్కులు, హోదాలు, సంపా దనలు.. వీటన్నిటికీ అతీతమైన బలమైన వ్యక్తిత్వం ఈ ఆవరణలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు లభిస్తుంది. కోఠి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులలో కనిపించే ఠీవికి అదే కారణం.
శత వసంతాల వేళ..
కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదనకు ఇటీవల సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. శత వసంతాలకు చేరువలో ఉన్న మహిళా కళాశాలకు ఇదొక మేలి మలుపే. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే, తెలంగాణలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికే యూజీసీ నుంచి స్వతంత్ర హోదాను సంపాదించింది కోఠి ఉమెన్స్ కాలేజ్.
మంచి నిర్ణయం
ఉమెన్స్ కాలేజ్ విశ్వవిద్యాలయంగా మారితే మహిళలకు మరింత నాణ్యమైన ఉన్నత విద్య లభిస్తుంది. కొత్తగా వీసీ, రిజిస్ట్రార్ పోస్టులు మంజూరు కావడంతోపాటు, ఇప్పటికే ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు అధ్యాపక పోస్టులు భర్తీ అవుతాయి. యూజీసీ నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఉన్నత విద్యలో మహిళల వాటా పెరగడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ నిర్ణయం మాకు, మా విద్యార్థినులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో ఇదొక అంతర్జాతీయ విద్యాలయంగా వెలుగొందుతుందని నా ప్రగాఢ విశ్వాసం. – ప్రొ. విజ్జులత, ప్రిన్సిపల్, కోఠి ఉమెన్స్ కాలేజ్