సుల్తాన్‌బజార్, ఆగస్టు 25 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినిమా డైలాగులు ఆపి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కోఠిలోని కమిషనర్ కార్యాలయం ముందు బీఆర్టీయూ అనుబంధ సంస్థ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల(ఆశా) సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకముందు ఆశా కార్యకర్తల జీతం రూ.3 వేలు ఉండేదని, మాజీ సీఎం కేసీఆర్ ఆశా కార్యకర్తల విధులు, కష్టాన్ని గుర్తించి రూ.9 వేలకు పెంచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి ఆశాల విధుల గురించి తెలియకపోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.9 వేలు ఇస్తున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలతో వెట్టిచాకిరీ చేయించడం కాదని, వారికి ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలని, వారిపై పెట్టిన ఏఎన్సీ టార్గెట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఆశాలతో ‘చలో హైదరాబాద్’ చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాలో ఆశ కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష, ప్రధాన కార్యదర్శి బీ మంజుల, నాయకులు లక్ష్మి, సరిత, రేణుక, అంజమ్మ, మంజుల, స్వరూప, బీఆర్టీయూ నాయకులు నారాయణ, దుర్గం శ్రీనివాస్, కిష్టయ్య, అరవింద్, శంకర్‌రెడ్డి, ప్రభాకర్, పెద్దసంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.