హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్కు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అంటూ కితాబిచ్చాడు. ‘కోచింగ్ బియాండ్ క్రికెట్ అకాడమీ’ ప్రారంభం కోసం గురువారం హైదరాబాద్కు వచ్చిన రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ ‘భారత్ తరఫున కోహ్లీ.. వందో టెస్టు ఆడటం గొప్ప అనుభూతి. మరో ఆరేడు ఏండ్లు అత్యుత్తమ స్థాయిలో క్రికెట్ ఆడే సత్తా అతడిలో ఉంది. గత రెండేండ్లుగా సెంచరీ లేకుండా కొనసాగుతున్నాడు. వందో టెస్టులో విరాట్ సెంచరీ చేస్తే మరింత చిరస్మరణీయం అవుతుంది. కెరీర్లో ప్రతి క్రికెటర్ ఒడిదొడుకులు ఎదుర్కొవడం సహజం. ఇందులో నుంచి విరాట్ త్వరలోనే బయటపడుతాడు. ఇప్పటికీ అతడు మూడు ఫార్మాట్లలో యాభై శాతం సగటు కల్గి ఉన్నాడు’ అని అన్నాడు. మరోవైపు హైదరాబాదీ బ్యాటర్ హనుమ విహారీ..జాతీయ జట్టుకు మరో పదేండ్లు ఆడే సత్తా అతనిలో ఉందని శాస్త్రి చెప్పుకొచ్చాడు.