హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమంటూ సోమవారం మీడియా సమావేశంలో వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే నిజమైతే తెలంగాణతోపాటు అనేక రాష్ర్టాలు రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నాయో చెప్పలేదు. రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణ ఆవశ్యకత గురించి కనీస అవగాహన లేకుండా కిషన్‌రెడ్డి మాట్లాడారని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ పాత్రపై కూడా అడ్డగోలు వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు.
కిషన్‌రెడ్డి ప్రచారం: రాజ్యాంగం ప్రకారం ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు. కేంద్రం అనుమతి అవసరం లేదు. జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చు.
వాస్తవం: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. దీంతో ఏదైనా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకోవాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అవుతున్నది. కాబట్టి రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. ఆ తర్వాత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చా లి. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి, ముస్లిం మైనార్టీలకు 4 నుంచి 12 శాతానికి పెంచుతూ 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. వారం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. పెంచిన రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని 2017 ఏప్రిల్ 24న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి విన్నవించారు. రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేలా చట్టం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్, తెలంగాణ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
కిషన్‌రెడ్డి ప్రచారం: హుజూరాబాద్‌లో ఓటర్లకు, పార్టీల నాయకులకు డబ్బులు ఇచ్చారు. రాజకీయ బేరసారాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రగతిభవన్ నుంచి మానిటరింగ్ చేశారు. హుజూరాబాద్ గెలుపును ప్రాధాన్యత లేని అంశంగా చూపేందుకే ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తున్నారు.
వాస్తవం: ఏ ఎన్నికలోనైనా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డడం రాజకీయ పార్టీల లక్షణం. టీఆర్ఎస్ మొదటి నుంచీ చేస్తున్నది అదే. బీజేపీ మాదిరిగా లోపాయకారీ ఒప్పందాలు చేసుకొని, తోకపార్టీగా మిగిలిపోలేదు. హుజూరాబాద్ ఎన్నికకు ప్రత్యేకత ఏమీలేదని, పార్టీ ఎదుర్కొన్న అనేక ఎన్నికల్లో ఇదొకటని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగస్టు 24న స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ సైతం ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. గెలుపోటములు సహజం’అని తేల్చి చెప్పారు.
కిషన్‌రెడ్డి ప్రచారం: మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్‌రోకోల్లో కేసీఆర్ పాల్గొనలేదు.
వాస్తవం: సీఎం కేసీఆర్ ఎన్నడూ తానొక్కడినే తెలంగాణ తెచ్చానని చెప్పలేదు. ‘అందరం కష్టపడి రాష్ర్టాన్ని సాధించుకున్నం’ అని సంబోధిస్తూ ఉంటారు. మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి చావు అంచు వరకు వెళ్లి వచ్చింది, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్‌రోకోలకు పిలుపునిచ్చింది, ముందుండి నడిపింది సీఎం కేసీఆర్ అని, టీఆర్ఎస్ అని ప్రతి ఒక్కరికీ తెలుసు.
కిషన్‌రెడ్డి ప్రచారం: యాసంగిలో ముడి బియ్యం కొంటామని కేంద్రం చెప్తున్నది. లేని సమస్య కోసం కేసీఆర్ ధర్నా చేస్తున్నారు.
వాస్తవం: వానకాలం సీజన్ ముగిసింది. రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. యాసంగిలో ఎంత బియ్యం తీసుకొంటారు కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. తెలంగాణలో కొన్నేండ్లుగా యాసంగిలో అంచనాలకు మించి వరి సాగవుతున్నది. కేంద్రం స్పష్టత ఇవ్వకుండా.. రైతులు వరి వేసిన తర్వాత ‘ఇంతే కొంటాం’ అని నిబంధన విధిస్తే అన్నదాతల పరిస్థితేమిటి? అందుకే టార్గెట్ విధించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇప్పుడే స్పష్టత ఇస్తే.. ఆ మేరకే పంట వేసేలా రైతులను ఒప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. బాయిల్డ్ రైస్ కొనేలా కేంద్రాన్ని ఒప్పించే సత్తా ఎలాగూ రాష్ట్ర బీజేపీ నేతలకు లేదు. కనీసం యాసంగిలో బియ్యం ఎంత కొనుగోలు చేస్తారో ఆర్డర్ తీసుకురాలేకపోతున్నారు.
కిషన్‌రెడ్డి ప్రచారం: రైతులు బాయిల్డ్ రైస్ పండించరు. వడ్లు మాత్రమే పండిస్తారు. బియ్యం కొనుగోలుకు, రైతులకు సంబంధమే లేదు.
వాస్తవం: యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుంది. క్వింటా ధాన్యాన్ని మరాడిస్తే వానకాలం పంటతో పోల్చితే 10-15 కిలోల బియ్యం తక్కువగా వస్తుంది. ఆ భారం మోస్తామని కేంద్రం చెప్పడం లేదు. కాబట్టి మిల్లర్లపైనే పడుతుంది. నష్టపోతామని తెలిసీ మిల్లర్లు కొనరు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి ఏం చేయగలదు? కాబట్టి కొనుగోలు చేయలేదు. ఫలితంగా రైతు నష్ట పోతాడు. అందుకే యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటామని చెప్తేనే వేయాలని సూచిస్తున్నది.
కిషన్‌రెడ్డి ప్రచారం: ఏడేండ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు.
వాస్తవం: ప్రభుత్వం టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) ద్వారా 7,892 పోస్టులు, గురుకులాల్లో 3,500 పోస్టులను భర్తీ చేసింది.