
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పడుకొనేందకు స్థలం ఇవ్వలేదని, అడిగినంత డబ్బు ఇవ్వలేదని, యాచకుడిని రోడ్డుపైకి తోసేసి హత్యకు పాల్పడ్డాడో సైకో కిల్లర్. ఫుట్‌పాత్‌పై పడుకొనేవాళ్లు, యాచకులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతూ ఖూనీలు చేసిన ఆ కిల్లర్‌ను హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన మహ్మద్ ఖదీర్ ఆటోడ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఐదుగురు పిల్లలు. చెడు అలవాట్లకు బానిసై ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నాడు. గత నెల 15న హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలో ఫుట్‌పాత్‌పై పడుకొన్న ఓ యాచకుడి దగ్గరికి వెళ్లి డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవటంతో రోడ్డుపైకి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన యాచకుడు మృతిచెందాడు. అదే నెల 31న రాత్రి 12 గంటల ప్రాంతంలో తబండ క్రాస్ రోడ్డు వద్ద పడుకొన్న ఓ వ్యక్తిని పైసలివ్వాలని బెదిరించాడు. అతడూ నిరాకరించటంతో రాయితో కొట్టిచంపి, జేబు లో ఉన్న రూ.150 తీసుకొని పరారయ్యాడు. అక్కడి నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి, తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆటో ట్రాలీలో పడుకొన్న ఖాజా అనే వ్యక్తిని నిద్రలేపి, తాను పడుకోవడానికి ట్రాలీలో స్థలం ఇవ్వాలని అడిగాడు. కాదనటంతో రాయితో తలపై మోది హత్య చేశాడు. హాబీబ్‌నగర్, నాంపల్లి పరిధిలో 4గంటల వ్యవధిలోనే రెండు హత్యలు జరగటంతో అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలు, పాత నేరస్థుల వివరాలతో మహ్మద్ ఖదీర్‌గా గుర్తించి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. నిందితుడు రెండు దొంగతనం కేసుల్లో ఆర్నెల్లు, ఓ హత్య కేసులో 16 నెలల జైలు శిక్ష అనుభవించినట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ శివమారుతి తదితరులు పాల్గొన్నారు.