ఏ ఇంటికెళ్లినా ఎటు చూసినా కిచ..కిచల సవ్వడులు వినపడేది..పట్నం, పల్లె అనే తేడాలేకుండా ఊర పిచ్చుకల సందడి కనిపించేది. లేత గోధుమ రంగు శరీరం..నలుపు వర్ణం పులుముకున్న ముక్కుతో కనువిందు చేసిది..వాటి కిచ కిచల రాగాలు వినసోంపుగా ఉండేది..ఇలా మనుషులతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఊరపిచ్చుక కాలక్రమేణా కనుమరుగవుతున్నది. యాంత్రిక జీవనంలో ఉనికి కోల్పోతున్నది.. అయితే ఇన్నాళ్ల్లూ మనకు ఆహ్లాదాన్ని పంచి..మనతో మమేకమైన ఈ ముచ్చటగొలిపే పిట్టలను కాపాడుకోవాలి.. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
– కోల్‌సిటీ/ వేములవాడటౌన్ మార్చి 19
ఇంటి గుమ్మాలు, వీధులన్నీ కిచకిచల శబ్దాలతో కళకళలాడేది. పల్లెటూళ్లే కాదు.. పట్టణాల్లో సైతం పిచ్చుకలకు ప్రత్యేక స్థానం ఉండేది. వీటి కోసం ఇంటి చూర్లకు వరి, సజ్జొన్న కంకులను వేలాడదీసేది. కొబ్బరి లేదా మట్టి చిప్పల్లో నీళ్లుపెట్టి ఈ పక్షుల దాహార్తి తీర్చేది. నిత్యం ఈ పక్షులు చేసే సందడిని చూసి పిల్లలు, పెద్దలు మైమరిచిపోయేది. ఇండ్ల ముందర చెట్లతోపాటు చేదబావుల్లో గూళ్లు కట్టుకునేవి. గుంపులు గుంపులుగా పంట చేలపై సంచరించే ఈ పిచ్చుకలు ఇప్పుడు పల్లెల్లో కూడా అరుదుగా దర్శనమిస్తున్నాయి. పంట చేలకు విపరీతమైన పురుగు మందులు వాడడం, సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ తీవ్రత, ఆహార కొరత, నివాసాలను కోల్పోవడం, పల్లెల్లో కూడా కాంక్రీట్ ఇండ్ల నిర్మాణంతో ఈ పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకమైంది. పట్టణాల్లో దాదాపు ఈ పక్షిజాతి కనుమరుగైంది..
తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపునకు హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటింది. ఇప్పుడు ఆ మొక్కలు ఇంతింతై వృక్షాలుగా ఎదిగాయి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. వీటిపై మళ్లీ పిచ్చుకలు వచ్చి వాలుతున్నాయి. కిచ..కిచల శబ్దాలతో సందడి చేస్తున్నాయి.
మనమందరం మేల్కొందాం..పర్యావరణ ప్రేమికులుగా మారి ఊర పిచ్చుకలను కాపాడుకొందాం.
మా ఇంటి ఆవరణలో పక్షులకు ప్రత్యేకంగా గూళ్లు నిర్మించిన. వాటికి ధాన్యపు గింజలు, నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచుత. ఎన్నో రకాల పిచ్చుకలు ఇంటి ఆవరణలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. పొద్దున్నే పిచ్చుకలు చేసే కిచకిచ శబ్దాలను వింటే మనసుకు హాయిగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు వాటితో సరదాగా కాలక్షేపం చేస్తా.
– గుర్రం శ్రీనివాస్, పర్యావరణ ప్రేమికుడు, గోదావరిఖని
ప్రతి రోజూ పిచ్చుకలకు ధాన్యపు గింజలు వేస్తుంటాను. ఇంటి ఆరు బయట వాటి కోసం నీళ్లు కూడా ఉంచుతాను. ఉదయం, సాయంకాలం పిచ్చుకలు తప్పకుండా వస్తాయి ఆహారం కోసం. వాటిని చూసినప్పుడల్లా చెప్పలేని ఆనందంగా ఉంటుంది.
– గోలివాడ చంద్రకళ, తెలంగాణ మిత్ర సేవా సమితి అధ్యక్షురాలు, రామగుండం
కమాన్‌చౌరస్తా, మార్చి 19: అతడి ఇంటి గుమ్మం వద్దకు రాగానే ‘కిచ..కిచ’ల సవ్వడులు వినిపిస్తాయి..ఆవరణలోఎటూ చూసిన పిట్టల గూళ్లు దర్శనమిస్తాయి..లేలేత గోధుమ వర్ణంతో కూడిన పిచ్చుకలు సందడి చేస్తాయి.. అక్కడికి వెళ్తే పచ్చటి ప్రకృతి ఒడిలోకి వెళ్లామా అనే అనుభూతినిస్తుంది.. అదే కరీంనగర్‌కు చెందిన అనంతుల రమేశ్ నివాసం..అతడు తన ఇంటి ఆవరణలో అరుదైన పక్షులను మచ్చికచేసుకుంటూ పిచ్చుకల ప్రేమికుడుగా మారాడు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’కు తన మనోగతాన్ని వెల్లడించాడు. ఐదేండ్లుగా ఊర పిచ్చుకలను పెంచుతున్నాను. ఉదయం, సాయంత్రం వేళల్లో గుప్పెడు ధాన్యపు గింజలను చల్లుతుంటాను. ఇంటి ఆవరణలో పిచ్చుకలు చేసే కిచకిచల శబ్దాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంటిల్లిపాది వీటి సందడిని చూసి తీరని అనుభూతికి లోనవుతున్నారు. ప్రతిఒక్కరూ పిచ్చుకలను సంరక్షణకు ముందుకువచ్చి జీవ వైవిధ్యాన్ని కాపాడి భావి తరాలకు అందించాలి.