
టేకులపల్లి, జనవరి 18 : మండలంలోని తావుర్యతండా గ్రామం లో మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నిరాకరించిందని నిందితుడు చాకుతో ఆమె మెడ నరాలు కోసి పరారయ్యాడు. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన భూక్యా పద్మ(38) భర్త ఏడు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సంవత్సర కాలం తర్వాత పద్మకు అదే గ్రామానికి చెందిన తన ఆడబిడ్డ భర్త గుగులోత్ వెంకన్నతో వివాహేతర సంబంధం ఏ ర్పడింది. విషయం బయటకు తెలి సి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో వెంకన్న తన భార్య సరోజిని వదిలిపెట్టి పద్మతోనే సహజీవనం సాగిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా వెంకన్న పద్మకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం “పిల్లలు పెద్దయ్యారు.. విడిపోదాం.. ఎవరి జీవితం వారు బతుకుదామని” పద్మ వెంకన్నతో తెగేసి చెప్పింది. దీంతో కోపంతో ఉన్న వెంకన్న మంగళవారం ఉదయం మిర్చి తోటకు వెళ్లిన పద్మపై కత్తితో దాడి చేసి మెడ నరాలు కోసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో టేకులపల్లి సీఐ రాజు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.