ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 23 : ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు, మరమ్మతులు, అవసరమైన వాటిని గుర్తించి చేపట్టాల్సిన పనులను అంచనా వేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. వారికి కేటాయించిన స్కూళ్ల వారీగా ఏఈలు హెచ్ఎంలతో కలిసి ప్రభుత్వం సూచించిన అంశాలను పరిశీలిస్తున్నారు.
తొలి విడత అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన 426 పాఠశాలలను ఏడు ఇంజినీరింగ్ విభాగాల అధికారులకు కేటాయించారు. మండలాల వారీగా పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించేందుకు ఏఈలను నియమించారు. ఇంజినీర్లు తమకు కేటాయించిన మండలంలో ఎంపికైన పాఠశాలల్లో అవసరాలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం, పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ ఇంజినీరింగ్ విభాగాలకు విధులు కేటాయించారు.
మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు పాఠశాలలను పరిశీలించి ఏయే అంశాల్లో పనులు అవసరమో గుర్తించి నివేదికలు రూపొందించారు. స్పెషల్ ఆఫీసర్లు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లతో కలిసి 12 అంశాలపై చర్చించి పనులు గుర్తించారు. ప్రత్యేక ఫార్మాట్‌ను ఇంజినీరింగ్ అధికారులకు అందజేశారు.