భద్రాచలం, ఫిబ్రవరి 22 : భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబల్లి గ్రామంలో మంగళవారం 220కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.44 లక్షలు ఉంటుందని అంచనా. దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో భద్రాచలం ఇన్చార్జి ఏఎస్పీ రోహిత్‌రాజ్ వివరాలను వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో దుమ్ముగూడెం ఎస్సై ఎం రవికుమార్, పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి చిన్ననల్లబల్లి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి వస్తున్న నంబర్ లేని కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, కారును ఆపకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా 220కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొని మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సిద్ధాంత దోలే, అమోలె గోర్డెగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.