ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 28: రెండు రోజుల క్రితం ప్రకటించిన ఐసీడీఎస్ గ్రేడ్-టూ సూపర్వైజర్ల ఫలితాల్లో ఖమ్మం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టుకు చెందిన పలువురు టీచర్లు ప్రతిభ చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాజెక్టు నుంచి ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లుగా ఎంపికయ్యారు. కొద్ది నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రేడ్-టూ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ.. రాత పరీక్షను కూడా నిర్వహించింది. కేవలం అంగన్వాడీ టీచర్లకు మాత్రమే అవకాశం కల్పించే ఈ విధానంలో కనీసం పదేళ్లపాటు టీచర్‌గా విధులు నిర్వహించిన వారు అర్హులు. భద్రాద్రి జోన్ పరిధిలో మొత్తం 79 పోస్టులకు గాను వందల సంఖ్యలో టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం విడుదలైన ఫలితాల్లో 79 పోస్టులకు గాను కేవలం ఖమ్మం జిల్లాకు చెందిన టీచర్లు 34 మంది అర్హత సాధించడం విశేషం. వీరిలోనూ గరిష్టంగా ఎనిమిదిమంది టీచర్లు ఖమ్మం అర్బన్ ప్రాజెక్టుకు చెందిన వారే కావడం గమనార్హం.
ఆర్డర్ కాపీలు అందజేసిన డీడబ్ల్యూవో..
గ్రేడ్-టూ సూపర్వైజర్లుగా ఎంపికైన 33 మంది టీచర్లకు జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో)సంధ్యారాణి సోమవారం ఆర్డర్ కాపీలు అందజేశారు. ఆయా ప్రాజెక్టుల సీడీపీవోలతో కలిసి తన కార్యాలయంలో ఈ ఉత్తర్వులను అందించారు. ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఏడుగురికి, మధిర ప్రాజెక్టు పరిధిలో ఆరుగురికి, కల్లూరు ప్రాజెక్టు పరిధిలో ఐదుగురికి, తిరుమలాయపాలెం ప్రాజెక్టు పరిధిలో ఐదుగురికి, ఖమ్మం రూరల్ ప్రాజెక్టు పరిధిలో నలుగురికి, సత్తుపల్లి ప్రాజెక్టు పరిధిలో నలుగురికి ఆర్డర్ కాపీలు అందజేశారు. వీరితోపాటు పోషణ్ అభియాన్ ప్రాజెక్టు నుంచి మరో ఇద్దరూ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన వారు స్వీట్లు తెచ్చి సీడీపీవోలు, డీడబ్ల్యూవో, జిల్లా కార్యాలయ అధికారులకు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో డీడబ్ల్యూవో సహా ఇతర అధికారులు నూతనంగా ఎంపికైన సూపర్వైజర్లకు అభినందనలు తెలిపారు. మరింత శ్రమించి పని చేసి ప్రశంసలు అందకోవాలని ఆకాంక్షించారు.
జిల్లాలో 24మందికి ఉద్యోగోన్నతి
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగోన్నతులు లభించాయి. పది సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారికి గ్రేడ్-2 సూపర్వైజర్లుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలోని 19మంది అంగన్వాడీ టీచర్లతోపాటు మరో ఐదుగురికి డీడబ్ల్యూవో వరలక్ష్మి సోమవారం తన కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు.