
బూర్గంపహాడ్, నవంబర్ 21: ‘పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. మొక్కల పెంపకంలోనూ వైఫల్యం చెందారు.. ఇదేనా మీ విధి నిర్వహణ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్. మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో ఆదివారం ఉదయం ఏడింటికే ఆయన ఆకస్మికంగా పర్యటించారు. సుమారు రెండు గంటలపాటు విస్తృతంగా పర్యటించి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తొలుత న్యూస్కాలర్ కాన్వెంట్ నుంచి కొత్తూరు వరకు నడుచుకుంటూ వెళ్లి పలు సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రహదారుల వెంట పర్యటిస్తున్న క్రమంలో పారిశుధ్యం లోపించినట్లు కన్పించడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ కార్యదర్శి మీకు తెలుసా..’ అంటూ గ్రామస్తులను అడిగారు. ‘మాకు తెలియదు’ అంటూ వారు సమాధానమివ్వడంతో మరింత అసహనానికి గురయ్యారు. సైడ్ డ్రెయిన్లలో పూడికతీత తీయడం లేదా అంటూ ప్రశ్నించారు. కొన్ని ఇళ్లలోకి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. నివాసాలను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పల్లెప్రకృతినవం, డంపింగ్‌యార్డులను సందర్శించారు. ప్రకృతివనంలో మొక్కలను చూసి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏపీవో శ్రీలక్ష్మిని ప్రశ్నించారు. నాలుగు వేల మొక్కలు నాటినట్లు ఆమె సమాధానమిచ్చారు. ‘మొత్తం కలిపినా రెండు వేల మొక్కలు కూడా ఉండవు.. అబద్దాలు చెబుతున్నారా?’ అంటూ మండిపడ్డారు. నాలుగు వేల మొక్కలుంటే ప్రకృతివనం చిట్టడవిని తలపించేదని, కానీ ఇక్కడ అలాంటిదేమీ కన్పించడం లేదని అన్నారు. కొత్తగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు నిర్వహణ కూడా సరిగాలేదన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు అందడంలేదని అక్కడి ప్రజలు చెప్పగా కమిషనర్ స్పందించారు. మిషన్ భగీరథ నీరు వీలైనంత త్వరగా వారికి అందించాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, డీపీవో లక్ష్మీరమాకాంత్, అడిషనల్ పీడీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో వివేక్‌రామ్, ఎంపీవో సునీల్‌శర్మ, డీఎల్పీవో పవన్‌కుమార్, ఏపీవో శ్రీలక్ష్మి, సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణరెడ్డి, కార్యదర్శి సాయి, సిబ్బంది పాల్గొన్నారు.