
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నది. ఈ ఏడాది ఖమ్మం జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలోని 589 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జోరుగా జరిగాయి. అధికారులు 53.49 లక్షల పని దినాలు కల్పించగా 2,20,221 మంది కూలీలు ఉపాధి పొందారు. వీరందరి వేతనాలకు ప్రభుత్వం రూ.80.16 కోట్లు చెల్లించింది. ఇతర పనులు, సామగ్రి కింద మరో రూ.31.55 కోట్ల నిధులు విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఆ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు
ప్రారంభించారు. ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, ఇంజినీరింగ్ కన్సల్టెంట్, శ్రమశక్తి సంఘాల
సభ్యులు, అసిస్టెంట్ పీడీ ఆధ్వర్యంలో ఈ నెల 30వరకు గ్రామసభలు
ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2022-23లో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, ఇంజినీరింగ్ కన్సల్టెంట్, శ్రమ శక్తి సంఘాల సభ్యులు, అసిస్టెంట్ పీడీ ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగనున్నాయి. జాబ్‌కార్డులపై సమాచారం నింపడం, గ్రామ సమాచార గోడ, నీటి సంరక్షణ, సహజ వనరుల యాజమాన్యం, కందకాలు, ఫారం పాండ్స్, పచ్చదనం పెంపు, ఇంకుడు గుంతల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ తయారీపై ప్రణాళికలు రూపొందించాలి. ఈ నెల 30లోపు లేబర్ బడ్జెట్ తయారీ చేయాలి. లేదా లేబర్ బడ్జెట్‌కు 200 % వరకు పనులు గుర్తించాలి. గ్రామసభలో పనులను ఆమోదింపజేయాలి. పని రోజుల ఆధారంగా 2022-23 సంవత్సరానికి నెలల వారీగా కోరిన పని రోజులను ఆ గ్రామ పంచాయతీ గ్రామసభలో ఆమోదించాలి. జిల్లా స్థాయి యూనిట్‌గా ఇతర శాఖల అనుబంధంతో చేసే పనులను కలుపుకొని మొత్తం పనుల సామగ్రి విలువ 40 % కంటే ఎకువగా మించకూడదు. మండల స్థాయిలో డిసెంబర్ 5 లోపు సిద్ధం చేసిన లేబర్ బడ్జెట్‌ను ఇదే నెల 20 నుంచి కలెక్టర్ పరిశీలనకు పంపాలి. వాటిని పరిశీలించి కలెక్టర్ వచ్చే జనవరి 31 లోపు ప్రభుత్వ అనుమతులకు పంపించాల్సి ఉన్నది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 31 వరకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నది.
పనుల గుర్తింపు ఇలా…
ప్రభుత్వం సహజ వనరుల యజమాన్యం, నీటి సంరక్షణ, ఉమ్మడి భూముల అభివృద్ధి పనులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిపై శ్రమ శక్తి సంఘాలు ప్రతి గ్రామ పంచాయతీలో వేతనదారులతో చర్చించాలి. వాటర్ షెడ్ సూత్రాల ఆధారంగా పనులను గుర్తించాలి. నీటి పారుదల కాలువలు, సంప్రదాయ నీటి వనరుల సంరక్షణ, ఉమ్మడి భూముల అభివృద్ధి, గ్రామీణ పారిశుద్ధ్యం, మంచినీటి బావుల పూడిక తీత, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, మత్స్య కారులకు చెందిన పనులు, భూముల్లో ఉత్పాదకత పెంపుదలకు సంబంధించిన పనులను అధికారులు గుర్తించనున్నారు. వేతనదారుల పొలాల్లో చేపట్టాల్సిన నీటి నిల్వ పనులు, సహజ వనరుల యాజమాన్య పద్ధతులను వివరించాలి. జీవనోపాధులకు సంబంధించిన పనులను గుర్తించాలి. ఎస్సీ, ఎస్టీ శ్రమ శక్తి సంఘాలు, వేతనదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారు కోరుకున్న పనుల జాబితాను సిద్ధం చేయాలి. సమగ్ర ప్రణాళికల తయారీలో నూతన పద్ధతులను అవలంబించాలి.
హరితహారానికి ప్రాధాన్యత..
హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని 24% నుంచి 33%కి పెంచాలని నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీశాఖ ఉన్నతాధికారులు 2022-23లో హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్లాంటేషన్, హరితహారం మొక్కల సంరక్షణ, వాచర్ల బాధ్యతల నిర్వహణ సక్రమంగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయత్‌రాజ్ చట్టం -2018ను పకడ్బందీగా అమలు చేయనున్నారు. కమ్యూనిటీ ల్యాండ్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, ఈత ప్లాంటేషన్స్, మంకీ ఫుడ్ కోర్టులు, హరిత వనాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు సిద్ధం చేయిస్తున్నారు. తులసి, కరివేపాకు, మునగ, చింత, మలబార్ వేప, యూకలిఫ్టస్, మల్బరీ, కరివేపాకు, తులసి, మునగ, శ్రీగంధం, వేప మొకల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020-21లో నర్సరీల్లో మిగిలిన మొక్కలను రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. మొకల మార్పిడికి అనువైన మొకలను పెద్ద సైజులో పెంచనున్నారు. అలాగే కొత్త మొక్కలూ పెంచనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతి నర్సరీలో కనీసం 10 వేల మొక్కలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మొకల ఎంపిక సర్వేలో శ్రీగంధం ప్లాంటేషన్‌కు లబ్ధిదారులను గుర్తించాలి. వాచర్లందరికీ నెలవారీ వేతనం సకాలంలో ఇవ్వాలి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలోని 589 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరిగాయి. పనులకు 1,36,112 కుంటుంబాల నుంచి దరఖాస్తులు అందగా ఉపాధిశాఖ అధికారులు 2,20,221 మందికి ఉపాధి కల్పించారు. వీరిలో 92,548 మంది పురుషులు, 1,27,673 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది 93.87 లక్షల పని రోజులు కల్పించాలని ఉపాధి హామీశాఖ అధికారులు లక్ష్యం నిర్దేశించుకోగా కరోనా తదితర కారణాలతో 53.49 లక్షల పని దినాలు మాత్రమే కల్పించారు. కూలీల వేతనాలకు ప్రభుత్వం రూ.80.16 కోట్లు చెల్లించింది. ఇతర పనులు, సామగ్రి కింద మరో రూ.31.55 కోట్ల నిధులు విడుదల చేసింది.