
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 21 : ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో అత్యధిక శాతం మందికి ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండకపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారనేది నిపుణుల అభిప్రాయం. నగరాల్లోని కళాశాలల్లో చదివిన విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత కళాశాలల్లో చదివిన విద్యార్థులు స్కిల్స్‌పరంగా కొంత వెనుకబడి ఉన్నారు. ఏటా ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో కేవలం 10 నుంచి 15 శాతం మంది మాత్రమే ఎంపిక అవుతున్నారు. సబ్జెక్ట్‌లో పట్టు ఉన్నా.. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేక, ఉద్యోగం రాక నిరాశకు లోనవుతున్నారు. ఉత్తమ మార్కులు సాధించడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే జీవితంలో రాణించగలుగుతారు.
ఇంగ్లిష్ గీటురాయి..
ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంసెట్ ప్రవేశపరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుని బీటెక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. ర్యాంకులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుంటారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలోనే బోధన సాగుతున్నా.. ఇంగ్లిష్‌పై పట్టు సాధించలేకపోవడంతో ఉద్యోగాల సాధనలో వెనుకబడి పోతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంగ్లిష్ పరిజ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత అనే అంశాలపై సందేహాలతో ఊగిసలాడుతున్నారు. ఆయా అంశాలపై పట్టు సాధిస్తేనే విజయం సాధించగలరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏ రంగంలోనైనా..
విదేశాలు వెళ్లి ఇంజినీరింగ్ మాస్టర్స్ కోర్సు చేయాలన్న విద్యార్థులకు అవసరమైనది స్కిల్స్ మాత్రమే. ఇంగ్లిష్‌పై పట్టు లేకపోతే వీసా దొరకని పరిస్థితి. ఇతర మార్కెటింగ్ రంగాల్లో రాణించాలన్నా స్కిల్స్ ఉంటేనే ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనేది ప్రస్తుత సమాజంలో నిత్యావసరంగా మారింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు అనేది అర్హతగా పరిగణిస్తున్నారు. చాలా సంస్థలు ఇంగ్లిష్‌లో మాట్లాడితే చాలు.. ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రథమ ప్రాధాన్యం లాంగ్వేజ్‌కు ఇస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వ్యక్తిగత సామర్థ్యంతోపాటు భాష సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితులూ నెలకొన్నాయి. అత్యధిక మంది విద్యార్థులు కోర్సులు నేర్చుకోవడంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు హాజరవుతున్నారు.
లాంగ్వేజ్, గణితం రెండు ముఖ్యమే..
విద్యార్థులు ఇంగ్లిష్‌తోపాటు గణితంపై పట్టు సాధించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. బీటెక్‌లో చేరిన మొదటి సంవత్సరం నుంచే ఇంగ్లిష్‌పై పట్టు కోసం ప్రయత్నం మొదలు పెట్టాలి. విద్యార్థులు భయాన్ని పక్కనపెట్టి ఏదో ఒకటి ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. మొదటి సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మాట్లాడడం ద్వారా చివరి సంవత్సరం వరకు పట్టు సాధిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధిస్తారు.
-చేర్వేల శ్రీనివాసశర్మ, ఎస్బీఐటీ అకడమిక్ డైరెక్టర్
పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం అవసరం
నియామక ప్రక్రియ దశలో విద్యార్థుల్లోని సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యం ఉంటుంది. స్కూల్, కళాశాల స్థాయిలో సాధించిన మార్కులతోపాటు ఇంగ్లిష్‌లో వారు కనబర్చే ప్రతిభకు మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు నిరంతరం స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. టీవీ చానళ్లను చూసి పరిజ్ఞానం పెంచుకోవచ్చు. వివిధ వేదికల ద్వారా అభిప్రాయాలను పంచుకోవడం.. వార్తా పత్రికలను చదవడం ద్వారా పట్టు సాధించవచ్చు. తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా భయాన్ని వదిలేసి, నేర్చుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలి.
-శ్రీరంజన్, ఐబీఎం సంస్థ ప్రతినిధి
స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్‌లకు వెళ్తున్నా..
ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులతోపాటు సాయంత్రం సమయాల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు హాజరు అవుతున్నా. బీటెక్ పాఠాలకు సంబంధించి లాంగ్వేజీ విషయంలో ఎలాంటి సమస్య లేకున్నా.. సందేహాల కోసం ఇంగ్లిష్‌లో అధ్యాపకులతో మాట్లాడే క్రమంలో కొంత బెరుకు ఉంటుంది. నేను ఇంగ్లిష్ మీడియంలో చదివినా.. గ్రామర్ విషయంలో తప్పులు లేకుండా చూసుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా.
-చావా జస్వంత్, బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి