
అశ్వారావుపేట, నవంబర్ 16: ఒక ఆటోడ్రైవర్ ప్రేమకు విద్యార్థిని బలైంది. ప్రతి రోజూ ఆటోలో పాఠశాలకు తీసుకెళుతున్న డ్రైవర్‌తో ఉన్న సన్నిహితం ప్రేమగా మారడంతో ఆ విద్యార్థిని స్కూల్ నుంచి వెళ్లిపోయింది. అప్పటికే వివాహితుడైన డ్రైవర్ కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో విద్యార్థిని, ఆటోడ్రైవర్ కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మాకరస్థితిలో ఉన్న వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలానికి చెందిన ఓ బాలిక (14) 9వ తరగతి చదువుతోంది. పొరళ్ల జగ్గారావు (28) ఆటోలో ప్రతి రోజూ పాఠశాలకు వెళ్తోంది. ఈ దశలో ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహితం కాస్తా ప్రేమగా మారింది. జగ్గారావుకు అప్పటికే వివాహమైంది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం పాఠశాలకు వచ్చిన బాలిక మధ్యాహ్నం భోజనం చేశాక పుస్తకాల బ్యాగును అక్కడే వదిలి బయటకు వెళ్లింది. సాయంత్రం తన కూతురు ఇంటికి రాకపోయే సరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే బాలిక, ఆటోడ్రైవర్ మంగళవారం సాయంత్రం అశ్వారావుపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. అప్పటికే పురుగుమందు తాగి.. వెనుక సీటులో అపస్మారక స్థితిలో ఉన్న జగ్గారావు, బాలికను కండక్టర్ గమనించి పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఆర్టీసీ బస్సులోనే ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చే సరికి అంబులెన్స్ ఎదురైంది. వెంటనే వారికి అంబులెన్స్‌లోకి మార్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇద్దరూ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై అరుణ వచ్చి పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహలను మార్చురీకి తరలించారు. చండ్రుగొండ పోలీసులు జగ్గారావు సెల్‌ఫోన్ సిగ్నల్‌పై నిఘా పెట్టగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో భయపడిన జగ్గారావు బాలికతోపాటు తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిసింది. కానీ కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో బాలిక, జగ్గారావు పురుగుమందు తాగినట్లు సమాచారం. మృతుల వివరాలను సేకరించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.