
ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శుక్రవారం జరుగుతున్న ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీవైపే స్పష్టమైన విజయావకాశాలు కన్పిస్తున్నాయి. అవిభాజ్య ఖమ్మం జిల్లాకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నలుగురు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం నుంచి కొండపల్లి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధారాణి పోటీచేస్తున్నారు. మొత్తం 568 మంది ఓటర్లగాను 500కు పైగా ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే. దీంతో టీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ స్పష్టంగా ఉంది. దీంతో ఆ పార్టీ విజయం సాధించడం నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే తమ పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్‌కు ఇప్పటికే సీపీఐ మద్దతు ప్రకటించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా తాతా మధుకు జిల్లా రాజకీయాలపై అవగాహన ఉంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అలాగే వివిధ మున్సిపాలిటీల్లోని ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా ఓటు వేయనున్నారు. తాతా మధు విజయం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పార్టీ విజయం సాధించాల్సిన ఆవశ్యకతను వివరించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థలను పరిపుష్టి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. బరిలో లేని పార్టీల ఓటర్లు సైతం టీఆర్ఎస్ అభ్యర్థి వైపే మొగ్గుచూపే అవకాశం ఉందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బరిలో నలుగురు అభ్యర్థులున్నా టీఆర్ఎస్కు మాత్రం పెద్దగా పోటీలేని పరిస్థితి. పార్టీ అభ్యర్థి తాతా మధు గెలుపు సునాయాసమేనని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా ఓటువేసి ఆయనను గెలిపిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులైన ఓటర్లకు మంత్రి అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.