
ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 9: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి తీరని లోటని వక్తలు అన్నారు. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణితోపాటు మరో 11 మంది సైనికులు మరణించడం అత్యంత విచారకరమని అన్నారు. వీరి మరణంపై పట్ల గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వివిధ సంస్థల బాధ్యులు, సంఘాలు, పార్టీల నాయకులు సంతాప సభలు నిర్వహించారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్యాలయ ఇన్చార్జి గుండాల (ఆర్జేసీ) కృష్ణ మాట్లాడుతూ ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. ఈ సందర్భంగా రావత్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాయి. నాయకులు, ప్రజాప్రతినిధులు బోజెడ్ల రామ్మోహన్, కొల్లు పద్మ, తాజుద్దీన్, చింతనిప్పు కృష్ణచైతన్య, తొగరు భాసర్, షంషుద్దీన్, తన్నీరు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో రావత్‌కు శ్రద్ధాంజలి
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మృతికి విద్యాసంస్థల్లోనూ నివాళులర్పించారు. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత రావత్‌కే దక్కుతుందని కొనియాడారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో చైర్మన్ జీ.కృష్ణ, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ గంధం శ్రీనివాసరావు, అకడమిక్ డైరెక్టర్లు సత్యనారాయణ, కృష్ణకాంత్, శ్రీనివాసశర్మ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. స్మార్ట్కిడ్జ్ పాఠశాలలో కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో రావత్‌కు నివాళులర్పించారు. కళాశాల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ జాకీరుల్లా, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ జరుపుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.