
మామిళ్లగూడెం, నవంబర్ 2: పిల్లాపాపలతో పటాకులు కాల్చడం ఆనందదాయకమే. కానీ కోటి వెలుగులు నింపాల్సిన దీపావళిని ఏమరుపాటుతో చీకటిమయం చేసుకోవద్దు.. జిల్లాలో ఇప్పటికే దీపావళి సందడి కనిపిస్తున్నది. చిన్నారులు, యువత పటాకులు కాలుస్తున్నారు. బాణసంచా కాల్చేటప్పు డు జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పటాకుల కొనుగోలుతో పాటు కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా..
విక్రయాలు ప్రారంభం..
ఖమ్మంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంతో పాటు జిల్లాలో పలుచోట్ల మంగళవారం పటాకుల విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు విక్రయాలు మందకొడిగా జరిగాయి. మొత్తం 106 స్టాల్స్ ఏర్పాటు కాగా ఒక్కో స్టాల్లో విక్రయదారులు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ గల క్రాకర్స్ ఏర్పాటు చేశారు. బుధ, గురువారాల్లో భారీగా విక్రయాలు జరుగనున్నాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
బ్రాండెడ్ పటాకులను కొంటే మంచిది. వీలైనంత వరకు నాటు పటాకులను దూరం పెట్టాలి. చిన్నారులు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉంటే మంచిది. విష్ణు చక్రాలు, భూచక్రాలు, చిచ్చు బుడ్లు కూడా కొన్నిసార్లు పేలుతున్న సంగతి తెలిసిందే. పటాకు ఏదైనా దూరంగా ఉండి కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిప్పు రవ్వలు కంట్లో పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. కంటి రక్షణకు నల్లని ప్లాస్టిక్ కళ్లద్దాలు ధరిస్తే మేలు. పటాకులు కాల్చిన తర్వాత కంటి సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలి. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు రంగుల అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, తాళ్లు కాల్చితే ప్రమాదాలను నివారించవచ్చు. యువతీ యువకులు చిచ్చుబుడ్లు, రంగుల ఫౌంటేన్లు, క్రాకర్స్ కింగ్స్, రాకెట్లు, లక్ష్మిబాంబ్లు, రెడ్ఫోర్టు బాంబ్లు, డబుల్ సెవెన్, తాటాకులు, మిర్చి బాంబులు కాల్చవచ్చు. పటాకులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. సగం కాలిన లేదని అసలు కాలని వాటిని నీటిలో వేయాలి లేదా ఇసుకలో కప్పివేయాలి. రాకెట్ బాంబులు కాల్చేటప్పుడు గుడిసెలు, పెట్రోలు బంకులకు దూరంగా ఉండాలి.
విక్రయదారులు పాటించాల్సిన నియమాలు..
జన సమూహాలు లేని ప్రాంతాల్లోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లోనే పటాకులు విక్రయించాలి. ప్రతి దుకాణం వద్ద ఐదు కిలోల డీసీబీ, మంటలార్పేందుకు సిలిండర్లను అందుబాటులో ఉంచాలి. ప్రతి దుకాణం వద్ద 200 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు పెద్ద డ్రమ్ముల్లో నీరు ఉంచాలి. రెండు వాటర్, రెండు ఇసుక ఫైర్ బకెట్లు ఉండాలి. విక్రయదారులపై నేర చరిత్ర ఉండకూడదు. పటాకుల విక్రయాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలు రాకూడదు. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
నిబంధనలు పాటించాలి…
పటాకుల దుకాణాదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఫైర్ నివారణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. డ్రమ్ముల్లో నీళ్లు, బకెట్లలో ఇసుకను అందుబాటులో ఉంచాలి. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. విద్యుత్ తీగలతో షార్ట్సర్క్యూట్స్ సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.