
మామిళ్లగూడెం, నవంబర్ 02 : దీపావళి వచ్చిందంటే పెద్దాచిన్నా తేడా లేకుండా బాంబులు కాలుస్తారు. అదే వ్యాపారులకు ఆదాయ వనరుగా మారుతున్నది. వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి తీసుకునే ముందుకు నిబంధనలు పాటిస్తామని చెప్పినా.. ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారుతున్నది. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఎండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వ్యాపారులు బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల ముందుగానే రెవెన్యూ అధికారులు వ్యాపారులకు షాపు నెంబర్లు కేటాయించి లైసెన్స్‌లు మంజూరు చేశారు. అయితే, వ్యాపారులు దుకాణాల ఏర్పాటులో నిబంధనలు తుంగలో తొక్కారు. బ్రాండెడ్ పేరుతో లోకల్మెడ్ టపాసులను జనానికి అంటగట్టేందుకు సిద్ధమయ్యారు. దుకాణాల్లో ధరల పట్టికను ఏర్పాటు చేయలేదు. జేసీ, పోలీస్, ఫైర్ అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు పట్టించుకోలేదు.
కానరాని బ్రాండెడ్..
బ్రాండెడ్ పేరుతో అధిక ధరలకు టపాసులను విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఆంధ్రా ప్రాంతంలోని గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో స్థానికంగా తయారు చేసే టపాసులను ఇక్కడికి తీసుకొచ్చారు. స్థానికంగా తయారయ్యే టపాసుల్లో నాణ్యతా ప్రమాణాలు, తగిన మోతాదులో మందుగుండును సమకూర్చకపోవడంతో ప్రమాదాలకు హేతువుగా మారే అవకాశం ఉంది. చిన్న పిల్లలు వీటిని కాల్చేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
షెడ్ల నిర్మాణంలోనూ లోపాలు..
బాణసంచా విక్రయించే స్టాల్స్ నిర్మాణంలోనూ నిబంధనలకు నీళ్లు వదిలారు. దుకాణానికి దుకాణానికి మధ్య మూడు అడుగుల దూరం ఉండాల్సి ఉండగా.. షెడ్ల నిర్వాహకులు నిబంధనలు పాటించలేదు. కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని చెప్పినా.. దుకాణదారులు ఆ ఏర్పాట్లు మర్చిపోయారు. దుకాణాల వద్ద శానిటైజరు సైతం అందుబాటులో ఉంచలేదు.
దీపావళి షాపుల లైసెన్స్‌ల ప్రక్రియ సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా జరిగింది. కలెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశాల మేరకు సీపీ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షణలో జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి జయప్రకాశ్ ఆధ్వర్యంలో ఖమ్మం ఫైర్ స్టేషన్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, అర్బన్ తహసీల్దార్ శైలజ సమక్షంలో దుకాణాదారులకు లైసెన్స్‌లు మంజూరు చేశారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు దుకాణాలు కేటాయించారు. అయితే, కొందరు దళారులు అధికారులకు మామూళ్లు ముట్టచెప్పాలని దుకాణాల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాణసంచా దుకాణాల లైసెన్స్‌ల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
భారీగా పెరిగిన టపాసుల ధరలు..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 106 టపాసుల విక్రయాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ గల క్రాకర్స్‌ను సిద్ధం చేశారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి టపాసులను అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. రాకెట్లు, 1000 వాలా, లక్ష్మీబాంబ్లు, ఆటమ్ బాంబ్‌లు, చిచ్చుబుడ్లు, హవాయి సువాయి, వెన్నెల మడుగు, కాకరపూలు తదితర క్రాకర్స్ ధరలు గతంలో కంటే భారీగా పెరిగాయి. కొంత మంది వ్యాపారులు గతేడాది మిగిలిన స్టాక్‌ను సైతం ఇప్పుడు స్టాల్స్‌కు తరలించారు. తొలిరోజు దుకాణాలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలబోయాయి. నేడు, రేపు దుకాణాల్లో సందడి కనిపించనున్నది.