Khaidi | టాలీవుడ్ గేమ్ ఛేంజర్ ,చిరంజీవి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన కల్ట్ క్లాసిక్ ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1983 అక్టోబర్ 28న విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ సినిమా విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రభావం, ఆ జోష్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అదే ఉత్సాహంతో ఉంది. ‘ఖైదీ’ కేవలం ఓ సినిమా కాదు ,టాలీవుడ్ రూపురేఖలనే మార్చేసిన రివల్యూషన్ మూవీగా నిలిచింది. చిరంజీవి స్టార్‌డమ్‌ని రికార్డ్ స్థాయిలో ఎగబాకేలా చేసిన ఈ సినిమా, నిజంగా ఆయనకు “బెయిల్ దొరకని ఖైదీ”గానే నిలిచిపోయింది. చిత్రం 42 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవి టీమ్ స్పెషల్ వీడియో విడుదల చేయగా, ఇది నెట్టింట వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అంటూ వీడియోని విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ‘ఖైదీ’ ఎలా పుట్టింది అనేది చూస్తే.. మొదట ఈ కథ సూపర్‌స్టార్ కృష్ణ కోసం ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. దర్శకుడిగా తొలుత కె. రాఘవేంద్రరావు పేరును పరిగణనలోకి తీసుకున్నారు. చివరికి ఆ బాధ్యత కోదండరామిరెడ్డి భుజాలపై పడింది. పరిచూరి బ్రదర్స్ రాసిన కథ, డైలాగ్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి అచ్చొత్తగా సరిపోయాయి.‘ఖైదీ’ కథ 1982లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫస్ట్ బ్లడ్’ (రాంబో సిరీస్ మొదటి చిత్రం) ఆధారంగా రూపుదిద్దుకుంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరు పూర్తి కథ విన్నారట. పరిచూరి బ్రదర్స్‌పై ఉన్న విశ్వాసంతో ఆయన ఎటువంటి సందేహం లేకుండా సినిమా చేయడానికి అంగీకరించారు.
చిరంజీవి ఈ సినిమాకి రూ.1.75 లక్షల పారితోషికం అందుకున్నారు. కోదండరామిరెడ్డి రూ.40 వేలే తీసుకున్నారు. కానీ ఫలితం మాత్రం ఆకాశాన్నంటింది. రూ.25 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.70 లక్షల బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ రోజుల్లోనే సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘ఖైదీ’ ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం. ఆ కాలంలోనే 3.2 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి .అది అప్పటి ఆల్‌టైమ్ రికార్డు. ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించబడింది. చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ గారు చీఫ్ గెస్ట్‌గా విచ్చేయడం ఆ వేడుకకు మరో విశేషం. ‘ఖైదీ’ విజయంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. జితేంద్ర హీరోగా నటించగా, మాధవి మరోసారి హీరోయిన్గా కనిపించింది.
తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చిన పేరు “ఖైదీ” ❤️#Khaidi – The film that redefined Telugu cinema and changed everything!
The rise of a phenomenon…
The birth of the MEGASTAR @KChiruTweets 🔥A revolution began in 1983, and the rest is history💥 #42YearsForKhaidi… pic.twitter.com/MOetNNQgTQ
— Team Megastar (@MegaStaroffl) October 28, 2025