Rishab Shetty | కాంతార చాప్టర్ 1 విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు నుండి విమర్శకుల వరకు అందరూ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బెర్మే పాత్రలో ఆయన చూపిన ఇంపాక్ట్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. “ఆ పాత్రను రిషబ్ కాకుండా మరెవరూ చేయలేరు” అని అభిమానులు, సినీ ప్రముఖులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ‘కాంతార’తో ఇప్పటికే నేషనల్ అవార్డు అందుకున్న ఆయన, ఈ ప్రీక్వెల్తో మరోసారి ఆ అవార్డు జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభంలో, మధ్యలో, క్లైమాక్స్‌లో కనిపించే మాయావి (మాయ కర) పాత్రలో ఎవరు నటించారు? అనే సందేహానికి ఇప్పుడు సమాధానం లభించింది.
ఆ పాత్రలలో రిషబ్ శెట్టి నటించాడు అని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. వారు రిలీజ్ చేసిన వీడియోలో రిషబ్ మేకప్ ప్రక్రియను చూపించారు. మాయావి పాత్ర మేకప్ కోసం సుమారు 6 గంటలు పట్టిందట. తెల్లవారుజామున ఆరు గంటలకే రిషబ్ షూటింగ్ స్పాట్‌కు చేరి, ఉదయం తొమ్మిదివరకు కుర్చీలో కూర్చొని మేకప్ చేయించుకున్నారని హోంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ వీడియోలో రిషబ్ శెట్టి చూపిన డెడికేషన్, కమిట్మెంట్ చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ‘కాంతార చాప్టర్ 1’లో రిషబ్ ఒకేసారి బెర్మే మరియు మాయావి అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న తేడాను ఆయన అద్భుతంగా ప్రదర్శించారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. “ఈ స్థాయి నటనకు మరోసారి నేషనల్ అవార్డు రావడం ఖాయం” అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
కంటెంట్‌తో పాటు కలెక్షన్లలో కూడా ‘కాంతార చాప్టర్ 1’ దూసుకుపోతోంది. థియేటర్లలో విడుదలై 25 రోజులు పూర్తయ్యేలోపే ఈ సినిమా 800 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా సినిమా సూపర్‌హిట్‌గా కొనసాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ (కనకవతి పాత్రలో), నటుడు జయరామ్ రాజుగా, ఆయన కుమారుడిగా గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందించగా, హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.