న్యూయార్క్: మూడోసారి కూడా అమెరికా దేశాధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2028లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం మూడోసారి దేశాధ్యక్ష పదవికి ఎవరైనా అనర్హులు. కానీ ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్ష హోదాను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వైట్‌హౌజ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. అలా చేయడానికి ఇష్టపడుతానని, తన వద్ద సంఖ్యా బలం ఉన్నట్లు చెప్పారు. కానీ నిజంగా దాని గురించి తానేమీ ఆలోచించడం లేదని కూడా అన్నారు.
తన పదవీకాలం ముగిసిన తర్వాత రిపబ్లికన్ పార్టీని నడిపించే అవకాశాలు ఉన్న నేతల పేర్లను ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్న మార్కో రూబియో, ఉపాధ్యక్షుడిగా ఉన్న జేడీ వాన్స్.. రిపబ్లికన్ పార్టీ వారసత్వాన్ని స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ పేర్కన్నారు. 2028 ప్రెసిడెన్షియల్ రేసులో వాళ్లు ఉండే అవకాశం ఉందన్నారు. తమ వద్ద మంచి వ్యక్తులు ఉన్నారని, తానేమీ మళ్లీ పోటీ చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా దేశాధ్యక్ష పదవిని కేవలం రెండు సార్లు మాత్రమే చేపట్టే అవకాశం ఉన్నది. అయితే రాజ్యాంగంలో మార్పులు తెచ్చి మూడోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వ్యూహకర్త బానన్ తెలిపారు. దీంతో ఈ అంశంపై చర్చ జరిగింది.