e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News దేవభూమిలో జలవిలయం

దేవభూమిలో జలవిలయం

  • ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 42 మంది మృతి
  • నేలమట్టమైన ఇండ్లు, కొట్టుకుపోయిన వంతెనలు, రైల్వేలైన్లు
  • జలదిగ్బంధంలో నైనిటాల్‌.. నీటిలో మునిగిపోయిన నైనాదేవి గుడి
  • చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సీఎం ధామి
  • పరిస్థితిపై ప్రధాని ఆరా.. సీఎంకు ఫోన్‌.. ఆదుకుంటామని హామీ
  • కేరళ, ఒడిశాకు వానగండం.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

డెహ్రాడూన్‌, అక్టోబర్‌ 19: దేవభూమి ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రైల్వేలైన్లు దెబ్బతిన్నాయి. పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వానలు, వరదల వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో మంగళవారం ఒక్కరోజే 37 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 42కు చేరింది. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌కు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ మూసుకుపోయాయి. జిల్లా కేంద్రం నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నైనీ సరస్సు ఉప్పొంగడంతో.. ఒడ్డున ఉన్న నైనాదేవి ఆలయంతో పాటు మాల్‌ రోడ్డు వరదనీటిలో పూర్తిగా మునిగిపోయింది. వరదనీటిలో చిక్కుకున్న వారికి సహాయం అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌, మూడు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని, ఇండ్లు కూలిపోయిన వారికి రూ. 1.9 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు.

- Advertisement -

వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, పర్యాటకులెవ్వరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరాతీశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ధామి, కేంద్రమంత్రి అజయ్‌భట్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

200 మంది సురక్షితం

ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా రామ్‌నగర్‌లోని లెమన్‌ ట్రీ రిసార్ట్‌లో బస చేసిన 200 మంది పర్యాటకులు వరద నీటిలో చిక్కుకుపోయారు. కోసీ నదిలో నీటిమట్టం పెరుగడంతో రిసార్ట్‌ భవనంలోని రెండో అంతస్థు వరకూ వరద నీరు చొచ్చుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. సహాయ బృందం సాయంతో అందరినీ రక్షించినట్టు వెల్లడించారు. కాపాడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువతులు కూడా ఉన్నారు.

కేరళ, ఒడిశాకు ఐఎండీ హెచ్చరికలు

ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న కేరళలో రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో 6-20 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని అంచనా వేసింది. వరదలతో ఇడుక్కి, పంబా, కక్కీతో పాటు మరో 78 జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు, ఒడిశాలో కూడా ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో మత్స్యకారులెవ్వరూ బంగాళాఖాతంలోకి చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. ఉత్తర ఒడిశాలోని సువర్ణరేఖ, బుధాబలంగ్‌, జలక నదులు ఉప్పొంగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, అస్సాం, మేఘాలయలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా వర్షాల కారణంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో యూపీలో నలుగురు మృతిచెందారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement