హనుమకొండ చౌరస్తా, జూన్ 9: హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న 10వ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థి దేశబోయిన సంతోష్ జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన క్యాడెట్లకు ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ర్టం, ఉత్తర కాశిలోని నెహ్రూ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి వంటి ఉన్నత విలువలు అభివృద్ధి చెందుతాయని అదేవిధంగా ఎన్సీసీ క్యాడెట్లకు భారత సైన్యంలో అగ్నివీర్ ద్వారా డైరెక్ట్ ఎంట్రీ అవకాశాలు లభించడంతో పాటు, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ప్రత్యేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎంపికైన క్యాడెట్ను ఎన్సీసీ ఆఫీసర్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, రాజశేఖర్, స్టాఫ్ సెక్రటరీ రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.