హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5,937 కోట్లతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.182 కోట్ల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫె్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దివంగత నేత పీజేఆర్ పేరు పెట్టిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.
SRDP | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్‌ఫ్రీ ప్రయాణమే లక్ష్యంగా రూ.5937 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 42 ఫ్లైఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు.. గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫె్లైఓవర్ను రూ.182 కోట్ల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు దివంగత నేత పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు.
దీంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద వాహనాలరద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఇది ఎస్ఆర్డీపీలో అందుబాటులోకి వస్తున్న 23వ ఫ్లైఓవర్ కావడం విశేషం. 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకన్లలో చేరుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్డీపీలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 42 ప్రాజెక్టులలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని చెప్పారు. పురోగతిలో ఉన్న ఆరు ప్రాజెక్టులు 2024 డిసెంబరు నెలాఖరులో అందుబాటులోకి రావాల్సి ఉండేదని చెప్పారు. హైదరాబాదీల తరపున కేసీఆర్‌కు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.