సుల్తాన్‌బజార్,ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో సుమారు వెయ్యిమంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ నేతృత్వంలో నిర్వహించిన 6వ మెగా రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీంతో కలిసి కవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, అనంతరం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం ముజీబ్హుస్సేనీకే సాధ్యమైందన్నారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తాను కూడా రక్తదానం చేయడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, సబ్బండ వర్ణాల అభ్యున్నతికి నిరంతరం పాటు పడే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముజీబ్‌హుస్సేనీ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ మాట్లాడుతూ, ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారు 730 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఈ యూనిట్స్‌ను ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన, ఉస్మానియా, నారాయణగూడ ఐపీఎం, రెడ్‌క్రాస్ సొసైటీ, తలసీమియా పిల్లల బ్లడ్ బ్యాంక్‌లకు అందజేస్తామని తెలిపారు. రక్తదానం చేసిన సుమారు వెయ్యి మందికి శ్రీని డెవలపర్స్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, సుమన్ ఫ్రూట్‌జ్యూస్, బిస్కట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, కార్యదర్శి గరిగబోయిన చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా శాఖ బాధ్యులు విక్రమ్‌కుమార్, బాలరాజు, రాజ్‌కుమార్, ఉమర్ఖాన్, శ్రీనివాస్, ఖాలీద్ అహ్మద్, నరేశ్, వైదిక్ శస్త్ర, శంకర్, గీత సింగ్, జానకి, సుజాత, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, దేవేందర్, వెంకటేశ్, రాజుతో పాటు ఐటిఐ విద్యార్థులు, హైదరాబాద్ యూత్ ఫోర్స్ సభ్యులు, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.