తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలి. పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలి. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండవర్గాలు, సకల జనుల జీవితాలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలి.
-కేసీఆర్
అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉన్నది.
-కేసీఆర్
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజానికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. ప్రతీప శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని, తెలంగాణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉన్నదని హితవుపలికారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురసరించుకొని, స్వరాష్ట్ర సాధన పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెకచేయక అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల మీద దశాబ్దాలపాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక అవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు.
ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దికుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోర్లు మూతపడేలా ప్రగతి పాలన అందించామని కేసీఆర్ తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకుతుందని పేర్కొన్నారు.
స్వరాష్ట్ర సాధనలో, ఆ తర్వాత పదేండ్ల పునర్నిర్మాణంలో చూపిన స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు నిరంతరం కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను పాలకులు ఎంచుకోవాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని స్పష్టంచేశారు. తెలంగాణ రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిని నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని, రైతులు, శ్రమజీవులు, సబ్బండవర్గా లు, సకల జనుల జీవితాలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్
ఆకాంక్షించారు.