హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : ఆయిల్‌పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహం చూపడంతో పంట దండిగా పండుతున్నది. ఫలితంగా 46వేల ఎకరాలకే పరిమితమైన సాగు గడిచిన మూడేండ్లలో మూడు లక్షల ఎకరాలకు చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విప్లవం మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టే ఇందుకు కారణం. రైతుల స్థిర ఆదాయం పెంచాలనే సంకల్పించిన ఆయన, మిగతా పంటలతో పోల్చితే ఎంతో డిమాండ్, లాభసాటి కలిగిన ఆయిల్‌పామ్ సాగువైపు రైతులను ప్రోత్సహించారు. కాళేశ్వరంతోపాటు చెరువుల అభివృద్ధి చేయడం వంటి పనులతో తెలంగాణలో సాగునీటి లభ్యత పెరుగడం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా మారింది.
ఆయిల్‌పామ్ పంటకు సాగునీరు అత్యంత ప్రధానం. గతంలో సాగునీరు లేక రైతులు ఆ పంట వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర పథకాలతో రాష్ట్రంలో సాగునీటి గోస తీరినా రైతు లు ఆయిల్‌పామ్ సాగువైపు వెళ్లకపోవడాన్ని కేసీఆర్ గమనించారు. ప్రపంచవ్యాప్తంగా పా మాయిల్ డిమాండ్‌ను, ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచాలని సంకల్పించారు. ప్రభుత్వ ప్రాధా న్య పథకాల్లోనూ దీన్ని చేర్చారు. 2021లో ‘మిషన్ ఆయిల్‌పామ్’ను ప్రారంభించి సాగు పై అన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. ఏ జిల్లా లు అనుకూలంగా ఉన్నాయో, ఏ మేరకు సాగుకు అవకాశం ఉన్నదనే లెక్కలు తీశారు. తద్వారా అన్ని జిల్లాలు సాగుకు అనుకూలమని తేలడంతో పక్కా ప్రణాళికలు రూపొందించారు. 20లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలవారీగా సాగు కోసం కంపెనీలను ఎంపిక చేశారు. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీ ఉండేలా చర్యలు తీసుకున్నా రు. రైతులను ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆయిల్‌పామ్ తోటలకు సందర్శనను తీసుకెళ్లి సాగు వల్ల కలిగే లాభాలను, సమకూరే ఆదాయాల గురించి క్షేత్రస్థాయిలో వివరించారు. ఆ తర్వాత రైతులను ఒప్పించి ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లేలా చేశారు. సాగు కోసం అవసరమైన నిధులు కేటాయించడం, డ్రిప్‌ను సబ్సిడీలో ఇప్పించడం వంటి అన్ని చర్యలతో ఆయిల్‌పామ్ సాగు విప్లవం మొదలైంది.
2020 దాకా అనేక జిల్లాల రైతులు ఆయిల్‌పామ్ తమ పంట కాదనే ఆలోచనలో ఉండేవారు. కేసీఆర్ దూరదృష్టి, ప్రోత్సాహంతో ఇ ప్పుడు ఈ పంట రాష్ట్రవ్యాప్తమైంది. 2020-21 వరకు 50 ఏండ్లలో తెలంగాణలో కేవలం 46వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పామ్ సా గైంది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే. ఆ తర్వాత 2021-22లో మిషన్ ఆయిల్‌పామ్‌లో భాగంగా సాగు వేగం పుంజుకున్నది. 2022 నుంచి ఇప్పటివరకు మూడేండ్లలోనే 2.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రస్తు తం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు 2.71 లక్షల ఎకరాలకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా పామాయిల్‌కు ఉన్న డిమాండ్‌తో రైతులకు ఈ పంట సాగుతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. భవిష్యత్‌లో డిమాండ్ తగ్గకుండా స్థిరమైన ఆదా యం సమకూరే ఆస్కారం ఉన్నది. ప్రస్తుతం దేశంలో 100 లక్షల టన్నుల డిమాండ్ ఉండ గా కేవలం 4లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్న ది. ఫలితంగా దిగుమతి కోసం దేశం ఏటా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నది. దీన్ని గమనించిన కేసీఆర్.. రైతులను ప్రోత్సహించేందుకు ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రతి ఎకరాకూ రూ.50 వేలకు సబ్సిడీ అందించారు. ప్రతి సంవత్సరం ఎకరానికి అన్ని ఖర్చులు పోను రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. అది కూడా ప్రతి 15 రోజులకోసారీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. అం తేగాక పంటను ఫ్యాక్టరీ వరకు తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కసారి నాటితే 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. 2014లో ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ.7,824 ఉండగా ప్రస్తుతం రూ.21,546 కు చేరింది. కరోనా తర్వాత ఆయిల్‌పామ్ ధర భారీగా పెరుగడం గమనార్హం. 2020 జనవరిలో టన్ను ధర రూ.10,809 ఉండగా ఆరేండ్లలో టన్ను ధర రెట్టింపైంది.
ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమైన సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ తీసుకున్న చర్యల్లో భాగంగానే రూపుదిద్దుకున్నది. బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పూర్తి చేసి 2023లో పునాది రాయి వేశారు. 60 ఎకరాలను టీజీఐఐసీ నుంచి కేటాయించి రూ.300 కోట్లతో అత్యాధునిక సాంకేతితతో నిర్మించేలా రూపొందించి నాడే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
