నగరం అత్యంత రద్దీ గల సిటీల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కుతోంది. ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నదని, దీనిద్వారా చిక్కులు కూడా పెరుగుతూ వాహనాల సరాసరి వేగం తగ్గుతున్నదని అంచనా వేసింది. పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రహదారులు, వాహన చోదకులు, వ్యాపారుల్లో కొరవడిన స్పృహ ఇలాంటి పరిస్థితులతో రద్దీ పెరుగుతున్నదని అంచనా వేసింది. నివాసాలు, రహదారులు, మెట్రో స్టేషన్లు, బస్సు ప్రయాణికులు, ఎంఎంటీఎస్ ప్రయాణికుల నుంచి సేకరించిన క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
ఆగస్టు 31, 2024 నాటికి సిటీలో మొత్తం వాహనాల సంఖ్య 92.13 లక్షలకు చేరుకోగా, ఈ వాహనాల సంఖ్యలో 16.15 లక్షల కార్లు, 67.58 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అయితే గతంలో ప్రతీరోజూ సగటున 1219 కొత్త వాహనాలు రోడ్లపైకి రాగా తాజాగా ఈ సంఖ్య 1500కు పెరిగింది. దీంతో ప్రస్తుతం నగరంలో మొత్తం వాహనాల సంఖ్య కోటికిపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతీ కి.మీ రహదారిపై సుమారు 9500 వాహనాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి.
– సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)
సరాసరి వేగం 18.4 కి.మీ.!
గ్రేటర్ హైదరాబాద్ సరాసరి వేగం సాధారణ సమయంలో గంటకు 18.4 కి.మీ కాగా రద్దీ వేళల్లో 16.1 కిమీగా నమోదైనట్లుగా అంతర్జాతీయ సంస్థ టామ్‌టామ్ ప్రకటించింది. టామ్‌టామ్ సంస్థ స్లో మూవింగ్ ట్రాపిక్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ 2024లో అంతర్జాతీయ స్థాయిలో 18వ ర్యాంకులో ఉంటే నిరుడు 47వ స్థానానికి ఎగబాకింది. 74.4శాతం కంజెక్షన్తో బెంగళూరు అంతర్జాతీయ స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్‌లో రోడ్లపై ఒక వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే సరాసరిన 32.37 నిమిషాలు పడుతున్నది. అయితే నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగ్గా ఉందా లేదా అనేది తేల్చడానికి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రవాణా రంగ నిపుణులు చెప్పారు. వాహనాల సరాసరివేగం ఆధారంగా ట్రాఫిక్ స్థితిగతులను అంచనా వేయకూడదని, రోడ్లవెడల్పు, బాటిల్‌నెక్స్, మౌలిక సందుపాయాలు అనేవి చాలా ముడిపడి ఉంటాయని, కంజెక్షన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత ట్రాఫిక్ చిక్కులు ఉన్నట్లు లెక్కగా చూడాలని వారు పేర్కొన్నారు.

రద్దీ రోజుగా..!
ఆగస్ట్ 30 శనివారం 2025 సంవత్సరంలోనే చాలా రద్దీ రోజుగా టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదించింది. ఇందులో 78 శాతం ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కోగా, సాయంత్రం 6 గంటలకు గతంలో ఎన్నడూ లేనంతగా 113 శాతం ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొన్నట్లుగా తమ సర్వేలో తేలినట్లు చెప్పింది. ఆ సమయంలో పదిహేను నిముషాల్లో 3.3 కిమీలు మాత్రమే ప్రయాణించగలిగారని తెలిపారు. సాధారణంగా గత సంవత్సరం ఉదయం వేళల్లో రద్దీ సమయంలో 66.4శాతం కంజెక్షన్(ట్రాఫిక్ చిక్కులు) ఉండగా, 10 కిమీలు ప్రయాణించడానికి 34 నిముషాల 53 సెకన్ల సమయం పట్టిందని, గంటకు 17.2 కిమీలు ప్రయాణించినట్లుగా సర్వేలో తేలింది. ఇక సాయంత్రం సమయంలో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 39 నిముషాల 28 సెకన్ల సమయం పడితే ట్రాఫిక్ కంజెక్షన్ 85.7 శాతం ఉందని, గంటకు 15.2 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగారని టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌లో పేర్కొన్నారు.
123 పనిగంటలు కోల్పోతున్నారు..!
62 దేశాల్లోని 500 నగరాల్లో టామ్‌టామ్ సంస్థ సర్వే చేపట్టింది. ఆయా నగరాల జనాభా, అక్కడి వాహనాల సంఖ్య, రోడ్లశాతం, ట్రాఫిక్ ఇబ్బంది సంఖ్యను విశ్లేషించింది. ప్రపంచంలోని ఇతర నగరాలను పోలుస్తూ ర్యాంకింగ్ ఇచ్చింది. హైదరాబాదీలు ఏడాదికి 123 పనిగంటలు నష్టపోతున్నట్లు లెక్కగట్టింది. అంటే ఐదు రోజుల మూడు గంటల విలువైన సమయాన్ని ట్రాఫిక్‌లోనే హైదరాబాదీలు కోల్పోతున్నారు. ఇది 2024 కంటే 1 గంట 16 నిముషాలు ఎక్కువని సర్వేలో పాల్గొన్న ప్రజల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని టామ్‌టామ్ సర్వే చెప్పింది. మరోవైపు 2025లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌లు అత్యధికంగా జరగగా వీటిలో 8 ట్రాఫిక్ జామ్‌లను గుర్తించామని, వీటి దూరం సరాసరి 1.7 కిమీలు ఉన్నట్లుగా చెప్పారు. బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, మెహదీపట్నం తదితర ప్రాంతాలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలుగా నమోదయ్యాయి.
