చరిత్ర పుటలపై చెదిరిపోని గుర్తు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, జగిత్యాలలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన, నలభై ఏండ్ల బోధనా ప్రస్థానంలో వేలాది మంది శిష్యులను సంపాదించుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ లెక్చరర్‌గా బోధించారు. చరిత్రలో అనేక పరిశోధనలతో గ్రంథాలు, పుస్తకాలను వెలువరించి ప్రఖ్యాతి గాంచారు. వయోభారం సమస్యలతో రమణయ్య మృతిచెందడంపై కేసీఆర్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. బోధన, పరిశోధన రంగంలో రమణయ్యసార్ చేసిన సేవలు చాలా గొప్పవని ప్రశంసించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర-సంస్కృతిని అక్షరబద్ధం చేసి ముందు తరాలకు మార్గదర్శకుడిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
జగిత్యాల, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలకు చెందిన జైశెట్టి రమణయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. 1939లో జన్మించిన ఆయన, ప్రాథమిక విద్యను, మెట్రిక్యులేషన్ కోర్సును జగిత్యాలలోనే పూర్తి చేశారు. మెట్రిక్లేషన్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొంది 1955లో తొలిసారిగా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆపైన అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో పదోన్నతులు పొందారు. బీఏ పూర్తి చేసిన తర్వాత పాఠశాల ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆపైన జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్లో సోషల్, ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేశారు. ఆపైన హిస్టరీ సబ్జెక్టులో పీజీ పూర్తి చేశారు. 1970లో లెక్చరర్‌గా పదోన్నతి పొంది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ సబ్జెక్టును బోధించారు. 1974లో సిద్దిపేట నుంచి జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీకి బదిలీపై వచ్చారు.
1985లో సెంట్రల్ యునివర్సీటీ నుంచి పీహెచ్డీ పట్టాను పొందారు. చాళుక్యాస్ అండ్ కాకతీయాస్ టెంపుల్స్, టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే రెండు పరిశోధన గ్రంథాలను వెలువరించారు. జగిత్యాల డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న తరుణంలోనే రీడర్‌గా పదోన్నతి పొందారు. 1996లో ఉద్యోగ విరమణ పొందారు. రమణయ్య 41 ఏళ్ల సర్వీస్‌లో అనేక విజయాలను సాధించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్యుమరేట్గా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
పరిశోధన గ్రంథాలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర-సంస్కృతి అనే పుస్తకాన్ని రచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పాత, కొత్తరాతి యుగం, చారిత్రక యుగం, శాతవాహనుల రాజ్యం ఇలా ఆధునిక చరిత్ర వరకు సకల వివరాలతో తన గ్రంథంలో పొందుపర్చారు. దాంతోపాటు కాలగమనంలోకి కోన సముద్రం, ఎలగందల్ పర్యాట కేంద్రం, వేములవాడ క్షేత్ర చరిత్ర తదితర పుస్తకాలు రచించారు. 1957 నుంచి ఆయన రాస్తూ వచ్చిన వ్యక్తిగత డైరీలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచాయి. వీటన్నింటిని సమీకృతం చేస్తూ ఆయన సొంత ఎదుగుదల అనే పుస్తకాన్ని సైతం వేశారు.
రమణయ్య జగిత్యాల ప్రాంతంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సుదీర్ఘ బోధన ప్రస్తానంలో వేలాది మంది గొప్ప శిష్యులను తయారు చేసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు విశ్వవిద్యాలయాల చాన్స్లర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, సుప్రీంకోర్డు జడ్జీలుగా రమణయ్య శిష్యులు పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ అనుమాండ్ల భూమయ్య, శాతవాహన వీసీ రాజారెడ్డి, ఇక్బాల్, కాకతీయ వీసీ లింగమూర్తి, సుప్రీంకోర్టు జడ్జీ జీవన్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య జయప్రకాశ్‌రావు ఇలా వేలాది మంది శిష్యులున్నారు. మాజీమంత్రి ఎల్ రమణ, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు సైతం ఆయన శిష్యులే.
జైశెట్టి రమణయ్య మృతి వార్త తెలియగానే పలువురు ప్రముఖులు, ఆయన శిష్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమణయ్య ఇంటికి వెళ్లి పార్థివ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చరిత్ర పరిరక్షక సమితి అధ్యక్షుడు డాక్టర్ పోతరవేని తిరుపతి రమణయ్య తదితరులు నివాళులర్పించారు. కాగా రమణయ్య కొడుకు అమెరికా నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం రమణయ్య ఆంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రమణయ్య సార్‌కు మంచి అనుబంధం ఉన్నది. పలు సందర్భాల్లో కేసీఆర్.. తన గురువు రమణయ్య సార్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. 2024 ఏప్రిల్ 6న జగిత్యాలకు వచ్చిన కేసీఆర్.. తన గురువు వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆయనకు పాదాభివందనం చేశారు. రమణయ్య సార్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ స్వయంగా ఇంటికి రావడంతో రమణయ్య సైతం ఆశ్యర్యపోవడంతోపాటు ఆనందానికి లోనయ్యారు. యూఆర్ ఏ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, క్రియేటర్ ఆఫ్ తెలంగాణ, మేకర్ ఆఫ్ బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్‌ను సంబోధించారు. కేసీఆర్ గురువుపై ఉన్న అభిమానంతో 2015లో పద్మశ్రీ అవార్డు కోసం తెలంగాణ నుంచి డాక్టర్ జైశెట్టి రమణయ్య పేరును ప్రతిపాదించారు. అలాగే ఉత్తమ పరిశోధకుడిగా కీర్తి అవార్డును ఇవ్వడంతోపాటు సభా వేదికపైనే అధికారులందరికీ తన గురువు అంటూ పరిచయం చేశారు.