చెన్నూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.1,658 కోట్లను కేటాయించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు రక్ష అని పేర్కొన్నారు. ఇంటికైనా, మట్టికైనా మనోడే ఉండాలని.. త్యాగాల తెలంగాణ గుజరాతీ గులాంల తెలంగాణగా కావద్దని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని చెన్నూరు నియోజకవర్గానికి సాగు, తాగు నీటికి ఢోకా లేకుండా చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పేందుకే కృతజ్ఞత సభ నిర్వహించుకొన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానంద్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల, నమస్తే తెలంగాణ