బెంగళూరు: ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మారణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు, బంధువులు ఆ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. (Student Dies At School) ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) ఉపాధ్యాయుడు తమ కుమారుడిపై దాడి చేయడం వల్లనే అతడు మరణించినట్లు వారు ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. దేవనహళ్లిలోని స్టెర్లింగ్ ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్లో గురుకిరణ్ ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం ఆ బాలుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అతడి తల్లిదండ్రులకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికే గురుకిరణ్ మరణించినట్లు తెలుసుకుని వారు ఆగ్రహం చెందారు.
కాగా, విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ వద్ద నిరసన చేపట్టారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) తమ కుమారుడిపై దాడి చేయడంతోనే అతడు మరణించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆ టీచర్‌పై దాడి చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. బాలుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.