హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగి, పలు హోదాల్లో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అజిత్ పవార్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేయడంలో అజిత్ పవార్ అంకితమయ్యారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలతో క్షేత్ర స్థాయిలో విస్తృత సంబంధాలు కొనసాగించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం అత్యంత విచారకమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అజిత్ పవార్ కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.