న్యూఢిల్లీ, జనవరి 28: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై చేస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మరో రూ.1,885 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.12,000 కోట్లకు చేరిందన్నది. కాగా, తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల్లో బ్యాంక్ డిపాజిట్లు, కొన్ని స్థిరాస్తులు, పెట్టుబడులున్నట్టు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ మోసం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తదితర సంస్థలకు సంబంధించిన కేసుల్లోవే ఈ జప్తులని కూడా వారు వివరించారు. అనిల్ గ్రూప్.. ఏ తప్పూ చేయలేదని వాదిస్తుండగా, వివిధ కంపెనీలు ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించాయని ఈడీ అంటున్నది.