సిటీబ్యూరో, జనవరి 28(నమస్తేతెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క క్లిక్ చేస్తే చాలు వాహన సేవలు అన్నీ మొబైల్ డిస్ప్లేపై దర్శనమిచ్చేవి. సుమారు 57 వాహన సేవలు ఆన్లైన్ చేసి సులభతరం చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పర్యవేక్షించేది. కానీ ప్రస్తుతం ఒక్క క్లిక్ కాదు.. వందల సంఖ్యలో క్లిక్ చేసినా ఒక్క సేవా కూడా సకాలంలో అందడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారథి పోర్టల్‌ను వినియోగిస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆర్టీఏ అధికారులు గోడు వెళ్ల్లబోసినా.. ప్రభుత్వం ఆ పోర్టల్‌లోకి తెలంగాణ లైసెన్స్‌ల ప్రక్రియను మార్చిన విషయం తెలిసిందే.
అయితే సారథిలో స్లాట్ బుక్ చేసుకోవడం నుంచి లైసెన్స్ పొందే వరకు జరిగే ప్రక్రియ వాహనదారులకు నరకం చూపిస్తున్నది. నాలుగు ఓటీపీలు, ఐదు క్యాప్చాలు ఎంటర్ చేయాల్సి వస్తోంది. చిన్న ఎర్రర్ వచ్చినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్క స్లాట్ బుక్ కావడానికి 40 నిమిషాలకు పైగా సమయం పడుతుందంటున్నారు.
రెన్యువల్ కోసం వస్తున్న వారిలో చాలా మంది వద్ద వారి పాత మొబైల్ నంబర్లు ఉండటం లేదు. సారథితో లైసెన్స్ పొందే సమయంలో అందించిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీలు వెళుతున్నాయి. దీంతో ఆటోమెటిక్‌గా పాత నెంబర్‌కు ఓటీపీలు వెళుతున్నాయి. ఆ నంబర్ ఇప్పుడు వాడటం లేదని, కొత్త నంబర్ తన పేరు మీద ఉందని చెప్పినా తమకు సంబంధం లేదని రవాణా శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
కొత్త నంబర్ లింక్ చేయడం కోసం మరో రోజు మరో వార్డులో గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. కానీ గతంలో స్లాట్ బుక్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు సారథి పోర్టల్‌లో అలాంటి ఆప్షన్ లేదని అధికారులు వివరిస్తున్నారు. అష్టకష్టాలు పడి లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకొని సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి వెళితే అక్కడ కూడా మళ్లీ ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. పది మందిలో నలుగురికి సాంకేతిక సమస్యలతో సేవలు మరో రోజు అందించాల్సిన దుస్థితి ఉంది.
వాహనదారులకు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్‌లు పనిచేయాల్సి ఉన్నాయి. కానీ సికింద్రబాద్, మేడ్చల్, మణికొండ, బండ్లగూడ తదితర కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు వాహనదారులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహన సేవలకు సంబంధించి ఎలా పొందాలో అధికారులను అడగటానికి వస్తున్న వారిని సైతం సెక్యూరిటీ సిబ్బంది గేట్ల వద్దనే ఆపేస్తున్నారు.
దీంతో సంబంధిత వాహన సేవ ఎలా పొందాలో తెలియక అక్కడే ఉన్న ఏజెంట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి వస్తుందని వాహనదారులు చెబుతున్నారు. స్లాట్ బుకింగ్ కేంద్రాలను ఆర్టీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ సేవకు ఎంత డబ్బులు చెల్లించాలో కార్యాలయాల వద్ద బోర్డులు పెట్టాలని కోరుతున్నారు. కాగా, సారథీ పోర్టల్ సమస్యల కారణంగా రవాణ శాఖ మిగిలిన వాహన సేవలను ‘వాహన్’లోకి తీసుకురావడానికి వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.
సారథి సమస్యలను ఆసరాగా చేసుకొని ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు సిబ్బంది, ఏజెంట్లు వాహనదారులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈనెల 21న సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మహేశ్ అనే 54 ఏండ్ల పై బడిన వ్యక్తి తన లైసెన్స్ గడువు ముగిసిందని వచ్చాడు. సిబ్బందికి తన సమస్య వివరించడానికి ప్రయత్నించగా వారు పట్టించుకోలేదని చెప్పాడు. తీరా అక్కడే ఉన్న కొందరు ఏజెంట్లు అతడి వద్దకు వచ్చి “3వేల రూపాయలు ఇవ్వు. మీ లైసెన్స్ ఇప్పిస్తా.
లైసెన్స్ ఫీజు కూడా మీరే చెల్లించుకోవాలి. నేను రమ్మన్నప్పుడు వచ్చి ఫొటో దిగిపో. లేకపోతే నీకు లైసెన్స్ నెలలు గడిచినా రాదు.’ అంటూ చెప్పారు. అక్కడే ఉన్న కొందరు ఏజెంట్లను సంప్రదించారు. ఇంకొందరు అంత డబ్బు చెల్లించలేమని వెళ్లిపోయారు. ఇలా చాలా మంది సారథి పోర్టల్ సాంకేతిక సమస్యలతో ఏజెంట్లకు డబ్బులు చెల్లించాల్సిన అనివార్యత ఏర్పడుతున్నది.